- రిటైర్డ్ డీజీపీ జె. పూర్ణచంద్రరావు
పంజాగుట్ట, వెలుగు: జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్‌పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతర ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో పసిపాప ప్రాణం పోవడం బాధాకరమన్న ఆయన.. ‘రజకులు హిందువులు కాదా? దేవుళ్లకు కేవలం రెడ్లే తాబేదార్లా?’ అని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి కేవలం తీర్మానాలకు పరిమితమయ్యారని విమర్శించారు. సంత్ గాడ్గే బాబా స్ఫూర్తితో బహుజన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
