- పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని, నమ్మక ద్రోహమని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్అయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ట్వీట్ చేశారు. ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలు పెంచడం దారుణమని, ఇది ముమ్మాటికీ ప్రజలను వంచించడమేనని మండిపడ్డా రు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందని విమర్శించారు. ‘కేంద్రం చెబు తున్న ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. దేశానికి ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశంలో యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న కేంద్ర హామీ ఒట్టి మాటగానే మిగిలిపోయింది. గత పదేండ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది’ అని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్,- ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యులపై భారం మోపడమేనన్నారు. ఈ పెంపు కారణంగా రవాణా ఛార్జీలు పెరిగి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయని, ఇది సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడవకముందే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని, ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకమేని పేర్కొన్నారు.
