సెజ్ కు పనికిరాని బ్యాక్ వాటర్ భూములు

సెజ్ కు పనికిరాని బ్యాక్ వాటర్ భూములు

నిర్మల్,వెలుగు: బాసర ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పరిధిలోని భూములు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా లేవంటూ నిపుణుల కమిటీ తేల్చింది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్న సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)ను బెల్లింపల్లికి తరలించినట్లు టీఎస్ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్​ఫాస్ట్రక్చర్​కార్పొరేషన్) ఆఫీసర్లు పేర్కొన్నారు. ఇప్పటికే బాసరలోని ప్రతిపాదిత సెజ్ లో పరిశ్రమలు ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు  బెల్లంపల్లిలోని భూదకలాన్ లో స్థలాలు కేటాయించినట్లు వెల్లడించారు. 

రెండు వేల ఎకరాల్లో...

ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పరిధిలోని బాసర వద్ద గల రెండు వేల ఎకరాల భూమిని గతంలో సెజ్ కోసం రెవెన్యూ అధికారులు సేకరించారు. ఈ భూముల్లోకి ఇప్పటి వరకు ఎలాంటి బ్యాక్​వాటర్​ రాకపోవడంతో కొందరు ఆక్రమించారు. అప్రమత్తమైన రెవెన్యూ ఆఫీసర్లు కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేశారు. భూములు మళ్లీ ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. నిర్మల్​ కలెక్టర్​ముషారఫ్​ అలీ ఫారూఖీ సేకరించిన రెండు వేల ఎకరాల భూమి నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్​) కోసం స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్​ఫాస్ట్రక్చర్​కార్పొరేషన్ కు  620 ఎకరాలు కేటాయించారు. 

సెజ్ లో వ్యవసాయ ఆధారిత, ఇతర పరిశ్రమల కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని గతంలో టీఎస్ఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. స్పందించిన 230 మంది పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం గాను ఒక్కొక్కరు రూ. 10 లక్షల ఈఎండీని చెల్లించారు. బాసరలోని ఎస్సారెస్సీ భూమి అనుకూలమో కాదో అన్న అంశంపై గతంలో భూగర్భజల శాఖ ఆఫీసర్లు సర్వే చేశారు. భూములు పరిశ్రమలకు అనుకూలం కావని తేలడంతో ఆఫీసర్లు ప్రత్యామ్నాయ దిశగా దృష్టి సారించారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్న బెల్లంపల్లిలోని భూదకలాన్ ను సెజ్ కోసం ఎంపిక చేసి ఇక్కడ పరిశ్రమలకు దరఖాస్తులు చేసుకున్న వారందరికీ అక్కడ స్థలాలు కేటాయించారు. 

చేజారిన సెజ్...

టీఎస్ ఐపాస్ నిబంధనల ప్రకారం బాసరలో పరిశ్రమలు స్థాపించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. భూముల్లో రోడ్లు, వీధి దీపాలు, డ్రెయినేజీలు నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీంతో పాటు కామన్  ఎఫ్ఎంటీ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు. బ్యాక్ వాటర్ భూములను నాలా కన్జర్వేషన్ చేసేందుకు కూడా రెడీ అయ్యారు. పొల్యూషన్ బోర్డు అనుమతుల కోసం చర్యలు చేపట్టారు. ఒక్కో పరిశ్రమకు మూడు నుంచి ఐదెకరాల భూమి కేటాయించేందుకు రెడీ అయ్యారు. ప్రధానంగా సెజ్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం కల్పించారు. బాసరలో ఇప్పటికే రైల్వేలైన్ తో పాటు పుష్కలమైన నీటి సౌకర్యం, రోడ్డు రవాణా సౌకర్యం  అందుబాటులో ఉండడం సెజ్ ఏర్పాటుకు అనుకూలమైంది. సరిహద్దులో ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాలు, మహారాష్ట్రలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలైన ధర్మాబాద్,​ భోకర్, నాందేడ్ సమీపంలో ఉన్న కారణంగా పరిశ్రమల ఏర్పాటు అనుకూలంగా ఉంటుందని నిర్ధారించారు. బ్యాక్ వాటర్ భూముల వ్యవహారంపై భూగర్భజల శాఖ అధికారులు సర్వేచేసి భూములు కుంగే అవకాశం ఉందని సర్కారుకు రిపోర్టు పంపించారు. ఈ భూముల్లో పరిశ్రమల స్థాపన అనుకూలం కాదని వెల్లడించారు. దీంతో సర్కారు ఇక్కడ సెజ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని బెల్లంపల్లిలోని భూదకలాన్ కు తరలించారు. 

భూములు కుంగే అవకాశం ఉంది..

బాసరలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ భూములు కుంగే అవకాశం ఉంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలం కావని నిపుణుల కమిటీ తేల్చింది. దీంతో ఇక్కడి సెజ్​ను బెల్లంపల్లికి తరలించాం. అక్కడ ఇప్పటికే దరఖాస్తు దారులకు భూముల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించాం. బాసర భూముల్లో సెజ్ నిబంధనల ప్రకారం పరిశ్రమల ఏర్పాటు సాధ్యం కాదు.
- దినేశ్, జోనల్ మేనేజర్, టీఎస్ఐఐసీ, నిజామాబాద్