గతేడాది మార్చి 2న రాష్ట్రంలో తొలి కేసు.. వేగంగా వ్యాపించిన మహమ్మారి
వ్యాక్సిన్లు, మెడిసిన్ లేకపోవడంతో భయపడిన జనం
వందల సంఖ్యలో రోగులు.. పదుల సంఖ్యలో హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు మృతి
లాక్‌డౌన్‌తో ఆగమైన పేదలు.. రోడ్డున పడ్డ లక్షలాది మంది ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా రాష్ట్రంలోకి ఎంటరై నేటికి ఏడాదైంది. ఒక్క కేసుతో మొదలై అత్యంత వేగంగా రాష్ట్రాన్ని చుట్టేసింది. వైరస్ స్పీడ్‌గా వ్యాపిస్తుండటం, వ్యాక్సిన్ లేకపోవడంతో జనం వణికిపోయారు. ఆ వ్యాధి సోకిన వ్యక్తుల దగ్గరికి వెళ్లేందుకు భయపడిపోయారు. అలాంటి రోజుల్లో డాక్టర్లు, నర్సులు, హెల్త్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడారు. ఎంతో మంది రోగులకు ట్రీట్‌మెంట్ చేశారు. లక్షలాది మందిని కాపాడారు. రోగులకు సేవలందిస్తూ పదుల సంఖ్యలో హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు మృతి చెందారు. తీవ్రమవుతున్న వైరస్ వ్యాప్తిని ఆపేందుకు కేంద్ర, రాష్ట్రాలు లాక్‌డౌన్ పెట్టగా దాని వల్ల పేదల బతుకులు ఆగమయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఆ తర్వాత మెల్లగా అన్‌లాక్ ప్రక్రియ స్టార్టవడం, వ్యాక్సిన్లు రావడంతో మళ్లీ జనజీవనం మామూలు పరిస్థితికి చేరుకుంటోంది.
దుబాయ్ వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా
ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన రామతేజ అనే యువకునికి మార్చి రెండో తేదీన చేసిన టెస్టులో వైరస్ కన్ఫామ్ అయింది. రాష్ట్రంలో ఇదే తొలి కేసు. తన ఇంటి పక్కన ఉండే వాళ్ల దగ్గర్నుంచి సీఎం కేసీఆర్ వరకూ ప్రతి ఒక్కరూ రామతేజపై వివక్ష చూపించారు. కరోనాను తగిలించు కొచ్చాడని తిట్టిపోశారు. ఆయన్ను గాంధీ హాస్పిటల్‌లో స్పెషల్ వార్డులో చేర్చగా డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చి మార్చి 13న డిశ్చార్జ్ చేశారు. మార్చి రెండు తర్వాత, మార్చి 12 వరకు కేసులు రాలేదు. మార్చి 13న రెండు కేసులొచ్చాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా రోజూ వందల్లో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ఇంటింటికీ వైరస్ చేరిపోయింది. హెల్త్ డిపార్ట్‌మెంట్ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం కరోనా కేసులు 2,98,923, కరోనా మరణాలు 1,634. కానీ రాష్ర్టంలో ప్రతి ముగ్గురిలో ఒకరు కరోనా బారినపడ్డట్టు పలు సర్వేల్లో వెల్లడైంది. వేల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
వణికించిన సోషల్ మీడియా
గతేడాది ఈ టైమ్‌కు ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ జరిగింది. సోషల్ మీడియాలో వైరస్ గురించి విపరీతంగా ప్రచారం జరిగింది. వుహాన్‌లో జనాలు రోడ్లపైనే చనిపోతున్నట్టు ప్రచారం జరగడంతో జనం భయపడిపోయారు. మార్చి 16న కరీంనగర్‌లో మర్కజ్ బృందాన్ని గుర్తించడం, అందులో 10 మందికి పాజిటివ్ రావడంతో జనాలు వణికిపోయారు. వైరస్ వ్యాప్తిని ఆపేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వెంటనే లాక్‌డౌన్ పెట్టాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ జరగ్గా, మార్చి 23 నుంచి రాష్ర్ట సర్కారు లాక్‌డౌన్ విధించింది. ఆ నెలలో 61 కేసులులే వచ్చాయి. అయితే ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వ్యక్తుల ద్వారా వైరస్ లోకల్‌గా వ్యాపించింది. అక్కడికి వెళ్లొచ్చిన ఓ వ్యక్తి మార్చి 27న మరణించాడు. రాష్ర్టంలో అదే తొలి కరోనా మరణం. సీఎం కేసీఆర్ పిలుపుతో ఏప్రిల్ తొలివారంలో మర్కజ్‌కు వెళ్లొచ్చిన వాళ్లు దవాఖాన్లకు పోటెత్తారు. ఆ నెలలో ఏకంగా 977 కేసులు నమోదయ్యాయి.
అల్లాడిన నిరుపేదలు
మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేసింది. దీంతో నిరుపేదలు, బెగ్గర్లు, వలస కూలీలు ఆకలితో అలమటించారు. నిత్యావసరాల రేట్లు పెరిగి సామాన్యులు అల్లాడిపోయారు. మే రెండో వారం నుంచి రాష్ర్టంలో సడలింపులు ఇచ్చారు. మే చివరి నుంచి అన్‌లాక్ మొదలైంది. మే నెలలో 1,660 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్ సడలింపులు, ప్రయాణాలు, రాకపోకలు, ఇతర రాష్ర్టాల నుంచి తిరిగొచ్చిన మైగ్రెంట్స్‌తో జూన్‌లో రాష్ర్టంలోని అని ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల్లోనే సుమారు 2 లక్షల కేసులు నమోదయ్యాయి. అక్టోబర్, నవంబర్‌లో వైరస్ వ్యాప్తి కాస్త తగ్గింది. ప్రస్తుతం రోజూ వంద నుంచి రెండొందల కేసులే వస్తున్నాయి.
వ్యాక్సినే శాశ్వత పరిష్కారం
ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల సహకారంతో ఏడాది గడవకుండానే రాష్ట్రంలో సాధారణ జనజీవనం నెలకొంది. సొంత వారు కూడా దగ్గరికి రాని సమయంలో ప్రేమ, ఆప్యాయతలతో ధైర్యంగా చికిత్స అందించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నా. కరోనాపై సమాచారాన్ని అందించి ప్రజల్లో భయాన్ని పొగొట్టి, వైరస్‌పై అవగాహన కల్పించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు, యాజమాన్యాలకు స్పెషల్ థాంక్స్. కరోనాను పారద్రోలడానికి వ్యాక్సినే పరిష్కారం. అందరూ వాక్సిన్ తీసుకోవాలి.
– ఈటల రాజేందర్, హెల్త్ మినిస్టర్
వైరస్‌ను ఓడించారు
కరోనాపై పోరాటంలో డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. సుమారు వంద మందికిపైగా ఈ పోరాటంలో మరణించారు. ఈ పోరాటంలో గాంధీ హాస్పిటల్ డాక్టర్లు, స్టాఫ్ కీలక పాత్ర పోషించారు. వైరస్ సోకిన వ్యక్తుల దగ్గరికి రావాలంటే కుటుంబీకులు కూడా వణికిపోతున్న రోజుల్లో పేషెంట్ల ఆలనా పాలనా చూశారు. మాస్కులు, పీపీఈ కిట్లు సరిగా లేకున్నా రాజీ పడుతూ పేషెంట్లకు సేవలు అందించి వేల మంది ప్రాణాలు కాపాడారు. కరోనా టైమ్‌లోనే గాంధీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ రాజారావు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్ నిత్యం హాస్పిటళ్లను సందర్శిస్తూ వైరస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
టెస్టులపై వివాదం
వైరస్‌ను కంట్రోల్ చేయడానికి వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయాలని డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ సూచించాయి. కానీ రాష్ట్రంలో ఏప్రిల్ రెండో వారం నుంచే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు టెస్టులు చేయడం ఆపేశారు. దీంతో వైరస్ చాపకింద నీరులా వ్యాపించింది. జూన్ 15 వరకు రోజూ ఆరేడు వందల టెస్టులే చేస్తూ వచ్చారు. జనాల నుంచి ఒత్తిడి పెరగడంతో జూన్ 16 నుంచి టెస్టులు పెంచారు. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆ నెల తొలి 15 రోజుల్లో 2,495 కేసులు నమోదైతే చివరి 15 రోజుల్లో 11,146 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. టెస్టు చేసిన ప్రతి వందలో 24 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ప్రభుత్వ వైఫల్యంతో వైరస్ విస్తరించడంతో కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చూపిస్తూ వచ్చారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ర్టంలో కరోనాతో 1,634 మంది చనిపోయారు. వాస్తవ లెక్క ఇంతకు పదింతలకు మించి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
