రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినా... భారతీయులకు గుండెపోటు ఎందుకు వస్తుంది ? డాక్టర్ల హెచ్చరిక...

రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినా... భారతీయులకు గుండెపోటు ఎందుకు వస్తుంది ?  డాక్టర్ల హెచ్చరిక...

మెడికల్ టెస్టుల్లో అంతా నార్మల్ అని ఉన్న సరే, భారతీయులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడైంది. డాక్టర్ మోహిత్ దయాల్ గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. గుండెపోటు వచ్చిన భారతీయుల్లో 80 శాతం మందికి, అంతకుముందు చేసిన మెడికల్ టెస్టుల్లో ఎలాంటి ముప్పు ఉన్నట్లు తేలలేదు. అంటే కొలెస్ట్రాల్, ఇతర రిస్క్ లు సాధారణంగా ఉన్న కూడా వారికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.

 సాధారణంగా డాక్టర్లు ఉపయోగించే గుండె జబ్బుల రిస్క్ కాలిక్యులేటర్లు  పాశ్చాత్య దేశాల ప్రజల ఆరోగ్య సమాచారంతో తయారైనవి. విదేశాల్లో గుండె జబ్బులు వయసు పైబడిన వారికి వస్తాయి. కానీ, భారతీయుల్లో గుండెపోటు వచ్చే సగటు వయసు 54 ఏళ్లు మాత్రమే. భారతీయుల శరీరం, ఆరోగ్యం విదేశీయుల కంటే భిన్నంగా ఉంటుంది. అందుకే ఆ పాత పద్ధతులు మన దేశస్థుల రిస్క్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి.

మన శరీర తీరులో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, వీటిని సాధారణ పరీక్షలు గుర్తించలేవు. బరువు తక్కువగా ఉన్నా, సన్నగా ఉన్నా సరే.. పొట్ట దగ్గర కొవ్వు  ఉండటం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తేడాలు అంటే మంచి కొలెస్ట్రాల్ (HDL) తక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, సాధారణ బరువు ఉన్నవారికి కూడా డయాబెటిస్ లేదా ఇన్సులిన్ సమస్యలు రావడం ఇంకా పని ఒత్తిడి, ధూమపానం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి..

 ఏం చేయాలంటే
కేవలం సాధారణ రక్త పరీక్షలు చేయించుకుని నాకు ఏం కాదులే అని ధీమాగా ఉండవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, నడుము చుట్టుకొలత పెరగకుండా చూసుకోవాలి. సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షలతో పాటు ApoB, లైపోప్రొటీన్(ఎ) వంటి మరిన్ని అడ్వాన్స్‌డ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

►ALSO READ | జ్యోతిష్యం :  సింహరాశి లోకి కేతువు.. మూడు రాశుల వారికి దశ మారుతుంది..! 

 ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం తప్పనిసరి. చిన్నపాటి రొమ్ము నొప్పి లేదా ఆయాసం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. భారతీయులకు ప్రత్యేకమైన రిస్క్ కాలిక్యులేటర్లు అవసరమని ఈ అధ్యయనం చెబుతోంది. అప్పటివరకు మన ఆరోగ్యంపై మనమే అవగాహనతో ఉండటం మంచిది.