పంటలెండిపోతుంటే జెండా పండుగలా?

పంటలెండిపోతుంటే జెండా పండుగలా?
  • ఎమ్మెల్యే అబ్రహంపై రైతుల ఆగ్రహం

అలంపూర్, వెలుగు: టీఆర్ఎస్ చేపట్టిన జెండా పండుగ కార్యక్రమం రసాభాసగా మారింది. ఉండవెళ్లి మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన అలంపూర్​ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంను స్థానిక రైతులు, గ్రామస్తులు నిలదీశారు. ఒక పక్క సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే జెండా పండుగ చేసుకోవడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.  జెండా పండుగ, మీటింగులంటూ రావడం తప్పమీరు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. కోట్లు ఖర్చు చేసి తుమ్మిళ్ల ప్రాజెక్టును నిర్మించినా సాగునీరు అందడం లేదన్నారు. మా ఓట్లతో గెలిచి సేవ చేయకపోతే కట్టేసి మరీ నిలదీస్తామన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్, గురుకుల స్కూళ్లు ఇతర చోట్లకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా  కష్టకాలంలో ఎన్నడన్న వచ్చారా అని ప్రశ్నించారు.  మరోసారి గ్రామానికి రావొద్దంటూ ఎమ్మెల్యే మొఖం మీదే తేల్చిచెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని, తుమ్మిళ్ల నుంచి సాగునీటిని విడుదల చేశామని, ఒకటిరెండు రోజుల్లో ఉండవల్లి మండలానికి నీళ్లు చేరుతాయని ఎమ్మెల్యే అబ్రహం వివరించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. దీంతో అబ్రహం జెండా ఎగరేసిన వెంటనే వెళ్లిపోయారు.