పాత మంచం ఇచ్చారని పెళ్లి క్యాన్సిల్ చేసిండు

పాత మంచం ఇచ్చారని పెళ్లి క్యాన్సిల్ చేసిండు

పెళ్లి అంటేనే పట్టింపుల వ్యవహారం. మర్యాదలు బాగాలేకపోయినా...పెట్టిపోతల్లో తేడాలు వచ్చినా అబ్బాయి తరపు వారు అస్సలు ఊరుకోరు. ఈ నేపథ్యంలో పెళ్లికి పెడతానన్న వస్తువుల్లో తేడా రావడంతో ఓ వరుడు ఏకంగా పెళ్లికే డుమ్మా కొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ బండ్లగూడలో చోటు చేసుకుంది. 

విషయం ఏందంటే..

స్కూలు బస్సు డ్రైవర్‌గా పనిచేసే మౌలాలికి చెందిన మహ్మద్‌ జకారియా(26)కు బండ్లగూడ రహమత్‌కాలనీకి చెందిన యువతి(22)తో పెళ్లి నిశ్చయమైంది.  ఈనెల 13న బండ్లగూడలో వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది.  ఆదివారం మధ్యాహ్నం స్థానిక మసీదు వివాహం జరగాల్సి ఉంది. అయితే సంప్రదాయం ప్రకారం  వధువు తండ్రి  అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు.  మంచం విడిభాగాలను జోడిస్తుండగా అది విరిగిపోయింది. దీంతో  పాత మంచానికి రంగులు వేసి పంపారని ఆగ్రహించిన జకారియా.. నిఖా సమయానికి మండపంలోకి వెళ్లలేదు.  పెళ్లికి వధువు తరపు బంధువులు అంతా వచ్చేసినా..కూడా  పెళ్లి కొడుకు రాలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు. ఎందుకు రాలేదని ప్రశ్నించగా..  పాత మంచం పెట్టారని.. విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు మండిపడ్డాడు. కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా ..... పెళ్లి జరగదని తేల్చి చెప్పాడు.  మంచం కోసం  వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని  వధువు తరపు వారు బతిమాలినా వరుడు వినలేదు.

పోలీసులకు ఫిర్యాదు..

ఎంత చెప్పినా పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులు వినకపోవడంతో పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చినా  ఫలితం లేకుండా పోయింది. చివరకు వరుడిపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.