ఈ ఏడాది సాధారణ వర్షాలే

ఈ ఏడాది సాధారణ వర్షాలే

న్యూఢిల్లీ: ఈ ఏడాది కూడా నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. ఈ సీజన్‌‌‌‌లో వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం వరకు నమోదవ్వొచ్చని వెల్లడించింది. జూన్‌‌‌‌, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నెలలలో లానినా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని పేర్కొంది. 40 శాతం సాధారణ వర్షపాతం, 15 శాతం సాధారణం కంటే ఎక్కువ (104 శాతం నుంచి 110 శాతం), 5 శాతం అధిక వర్షపాతం (110 శాతం కంటే ఎక్కువ) ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 26 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్‌‌‌‌ ఉందని చెప్పింది. 14 శాతం లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరం, సెంట్రల్‌‌‌‌ ఇండియా, హిమాలయాల దిగువ ప్రాంతాలతో పాటు వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం రికార్డు కావొచ్చని పేర్కొంది. ఈశాన్య, వాయువ్య ప్రాంతాల్లోని కొన్ని ఏరియాలతో పాటు దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం రికార్డ్ కావచ్చని చెప్పింది. మే చివరినాటికి రుతుపవనాల సీజన్‌‌‌‌కు సంబంధించి పూర్తి సమాచారం వెల్లడిస్తామని తెలిపింది. ఈ సీజన్‌‌‌‌ మొత్తం పసిఫిక్‌‌‌‌ రిజీయన్‌‌‌‌లో లానినా ప్రభావం ఉంటుందని చెప్పింది. కాగా, 1971–--2020 మధ్య సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయిందని చెప్పింది. 2019, 2020, 2021లలో కూడా దేశంలో సాధారణ వర్షపాతమే నమోదైందని తెలిపింది.


మూడు రోజులు వానలు
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో పడే అవకాశముందని తెలిపింది.