చావు నోట్లోకి వెళ్లొచ్చారు: బ‌స్సు ప్ర‌మాదంలో మిరాకిల్

చావు నోట్లోకి వెళ్లొచ్చారు: బ‌స్సు ప్ర‌మాదంలో మిరాకిల్

సిమ్లా: అప్పుడ‌ప్పుడూ రోడ్డు ప్ర‌మాదాల్లో ఊహించ‌ని మిరాకిల్స్ జ‌రుగుతుంటాయి. చావు అంచుల దాకా తీసుకెళ్లి మ‌ళ్లీ ఒడ్డున ప‌డేస్తాడు దేవుడు. ఇలాంటి ఘ‌ట‌నే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో శుక్ర‌వారం జ‌రిగింది.

నిన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ హైవే 707పై  వెళ్తున్న ఓ ప్రైవేటు బ‌స్సులో ప్రయాణికులంతా అదృష్టాన్ని జేబులో పెట్టుకుని ఉన్నారు. సిర్మౌర్ జిల్లా సిల్లై ప్రాంతంలో బొహ్ర‌డ్ ఖాడ్ ద‌గ్గ‌ర‌కు రాగానే కొండ ప్రాంతంలో స‌డ‌న్‌గా టైరు పేలింది. దీంతో సెకన్ల గ్యాప్‌లో బ‌స్సు లోయ వైపు దూసుకెళ్లింది. కొంచెం ఉంటే లోయ‌లో ప‌డిపోయేది. అదే జ‌రిగి ఉంటే ఆ బ‌స్సులో ఉన్న 22 మంది ప్రాణాలు గాలిలో దీపంలా అయ్యేవి. అదృష్టం కొద్దీ డ్రైవ‌ర్ చాలా చాక‌చ‌క్యంగా బ‌స్సును కంట్రోల్ చేయ‌డంతో కొండ అంచున ఒక క‌రెంట్ స్తంభానికి త‌గులుకుని అలా వేలాడుతూ ఉండిపోయింది. అయినా ఎవ‌రైనా క‌దిలితే బ‌స్సు బ్యాలెన్స్ త‌ప్పి లోయ‌లో ప‌డిపోతుందేమోనన్న భ‌యం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది. అలాంటి స‌మ‌యంలో ఒక్కొక్క‌రిని జాగ్ర‌త్త‌గా కింది దించేలా డ్రైవ‌ర్ సూచ‌న‌లు చేసిన‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్ర‌యాణికులంతా దిగిన త‌ర్వాత డ్రైవ‌ర్ కిందికి రావ‌డానికి వాళ్లు సాయం చేశారు.