సోరెన్  నివాసంలో అధికార కూటమి ఎమ్మెల్యేల సమావేశం

సోరెన్  నివాసంలో అధికార కూటమి ఎమ్మెల్యేల సమావేశం

రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో అధికార కూటమి ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫారసు చేసిందన్న వార్తలొచ్చాయి. దీంతో రాంచీలోని తన నివాసంలో జేఎంఎంతోపాటు అధికార కూటమిలోని యూపీఏ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ సిఫారసుపై చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు మీటింగ్ కు హాజరుకాలేదు. వారంతా తమపై నమ్మకంతో ఉన్నారని... కొన్ని సమస్యల వల్ల మీటింగ్ కు రాలేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఇవాళ సాయంత్రం మరోసారి సమావేశమవుతామన్నారు.

కాగా... జార్ఖండ్ సీఎం సోరెన్  మైనింగ్  లీజు వ్యవహరంలో స్వీయ లాభం పొందారని బీజేపీ ఆరోపించింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్  రమేశ్ బాయిస్ కు సూచించినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై రాజ్ భవన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం.. చట్టసభకు ఎన్నికైన ప్రతినిధిపై అనర్హత వేటు నిర్ణయం అంతిమంగా గవర్నరే తీసుకోవాలి. దీంతో గవర్నర్ నిర్ణయంపై టెన్షన్ నెలకొంది. మరోవైపు అనర్హత వేటు గురించి తనకెలాంటి సమాచారం అందలేదని సీఎం హేమంత్  సోరెన్ అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు.