
- ఇండియా కూటమి అధికారంలోకి వస్తది
- రక్షించాలంటూ అదానీ, అంబానీని ప్రధాని వేడుకుంటున్నరని కామెంట్స్
కన్నౌజ్ (యూపీ): దేశంలో ఇండియా కూటమి తుఫాన్ రాబోతున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి కాలేరని తెలిపారు. ‘‘ఇండియా కూటమికి బంపర్ మెజారిటీ వస్తది. ఈసారి మోదీ మాత్రం పీఎం కాలేరు. నమ్మకం లేకపోతే.. పేపర్ మీద రాసిస్తా. బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రావు. ఎన్డీఏ కూటమి ఘోరంగా ఓడిపోబోతున్నది’’అని రాహుల్ అన్నారు. యూపీలోని కన్నౌజ్, కాన్పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘
‘ఇండియా కూటమి నన్ను చుట్టుముట్టింది. నేను ఓడిపోబోతున్నాను. నన్ను రక్షించండి.. అదానీ జీ.. అంబానీ జీ.. నన్ను రక్షించండి’’ అంటూ మోదీ తన ఇద్దరు ఫ్రెండ్స్‌ను వేడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. తన ఇద్దరు ఫ్రెండ్స్.. ఏ టెంపోలో.. ఎంత డబ్బు పంపిస్తారనే విషయం మోదీకి తెలసని రాహుల్ ఆరోపించారు. మోదీకి టెంపోతో వ్యక్తిగత అనుభవం ఉందని ఎద్దేవా చేశారు. ఎన్ని టెంపోల్లో డబ్బులు పంపినా.. యూపీలో అఖిలేశ్, దేశంలో ఇండియా కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. యూపీలోని 80 సీట్లకుగాను 50 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలుస్తారని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.