Silver Rate: 19 రోజుల్లో లక్షా 50 వేలు తగ్గిన వెండి.. మరో 50 వేలు తగ్గుతుందా..?

Silver Rate: 19 రోజుల్లో లక్షా 50 వేలు తగ్గిన వెండి.. మరో 50 వేలు తగ్గుతుందా..?

బులియన్ మార్కెట్‌లో వెండి ధరల పతనం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం గడచిన 19 రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా లక్షా 50 వేల రూపాయల మేర దిగిరావడం ఇన్వెస్టర్లను, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత నెల చివరలో రూ.4లక్షల10 వేల ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరిన వెండి.. ప్రస్తుతం రూ.2లక్షల 60 లక్షల దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ భారీ పతనం వెనుక ఉన్న కారణాలు.. భవిష్యత్తులో మరో రూ.50 వేలు తగ్గే అవకాశం ఎంత వరకూ ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు సిల్వర్ ఎందుకు తగ్గుతోంది..?
బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం వెండి ధరల పతనానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ముందుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వేచి చూసే ధోరణిని అవలంబించడం.. అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం వెండి ధరలపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఇక అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలు (COMEX) వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై మార్జిన్లను పెంచడంతో, ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను వదిలించుకోవాల్సి రావటం రెండో కారణంగా ఉంది. ఇక చివరిగా ఈ నెల ప్రారంభంలో వెండి కేజీ రూ.4 లక్షలు దాటాక ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవటం కూడా మార్కెట్లో రేట్లు ఒక్కసారిగా కుప్పకూలేలా చేశాయి.

మరో రూ.50 వేలు తగ్గుతుందా..?
ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్ బేరిష్‌గా ఉంది. లేటెస్ట్ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. వెండి ధరలకు రూ.2లక్షల 45వేల వద్ద బలమైన సపోర్ట్ ఉందని తేలింది. ఒకవేళ అంతర్జాతీయ పరిస్థితులు ఇంకా దిగజారితే లేదా అమెరికాలో వడ్డీ రేట్లు అనూహ్యంగా పెరిగితే తప్ప.. మరో రూ.50 వేలు సిల్వర్ తగ్గే అవకాశం లేదు. అంటే కేజీ వెండి రూ.2 లక్షల స్థాయికి పడిపోయే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే స్వల్పకాలికంగా రూ.2లక్షల10వేల నుంచి రూ.2లక్షల 30వేల మధ్య వెండి కన్సోలిడేట్ అయ్యే అవకాశం ఉందని దేశీయ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అంచనా వేస్తోంది.

పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్ ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఈవీ వాహనాల తయారీలో ఇప్పటికీ బలంగానే ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది కేవలం 'ప్రైస్ కరెక్షన్' మాత్రమేనని.. ఇది కొనుగోలుదారులకు ఒక సువర్ణావకాశమని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే వెండి మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ, మరికొద్ది రోజులు వేచి చూడటం బెస్ట్ అని వారు అంటున్నారు.