పోలీసులపై దాడి కేసులో బాల్క సుమన్ అరెస్ట్

పోలీసులపై దాడి కేసులో బాల్క సుమన్ అరెస్ట్

క్యాతన్‎పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులపై దాడి చేసిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. చైర్మన్, వైస్ ఎన్నికలో ఎక్స్ ఆఫిషియో ఓటు వేసేందుకు  క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళుతున్న.. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ కాన్వాయ్‎పై రాళ్లతో దాడి చేయటం.. పోలీస్ సెక్యూరిటీ కోన్ విసిరేయటం వంటివి చేశారు బాల్క సుమన్. 

తన అనుచరులను రెచ్చగొట్టి.. దాడి చేయించటంలో కీలక పాత్ర పోషించారు బాల్క సుమన్. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్‎లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మరో కాంగ్రెస్ కార్యకర్త సైతం గాయపడ్డాడు. క్యాతనపల్లిలో జరిగిన గొడవపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

ఈ కేసులో భాగంగా 2026, ఫిబ్రవరి 18న క్యాతనపల్లిలోని బాల్క సుమన్ ఇంటికి వెళ్లిన పోలీసులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాల్క సుమన్ ఇంటి వద్ద కాసేపు హైడ్రామా నడిచింది. బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను అతడి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

బాల్క సుమన్ ఇంటి గేటు మూసి పోలీసులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి హంగమా సృష్టించారు. అయినప్పటికీ సంయమనంతో వ్యవహరించిన పోలీసులు రూల్స్ ప్రకారం బాల్క సుమన్‎ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.