Bigg Boss Telugu Season 10: 'బిగ్ బాస్ తెలుగు 10'కి నాగార్జున రెమ్యునరేషన్ రికార్డ్.. ఆ ఒక్క సీజన్‌కే అన్ని కోట్లా?

Bigg Boss Telugu Season 10: 'బిగ్ బాస్ తెలుగు 10'కి నాగార్జున రెమ్యునరేషన్ రికార్డ్.. ఆ ఒక్క సీజన్‌కే అన్ని కోట్లా?

బుల్లితెరపై రియాల్టీ షోల ట్రెండ్ నే మార్చేసిన షో 'బిగ్ బాస్ '. ఈ షోపై ఎన్ని వివాదాలు , విమర్శలు ఉన్నా ప్రేక్షకాదరణలో మాత్రం ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఇప్పటికే తెలుగులో తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదో సీజన్ కు సిద్ధమవుతోందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సీజన్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం భారీగానే ఏర్పాట్లు చేస్తుండగా.. హోస్ట్ గా కింగ్ నాగార్జున రెమ్యునరేషన్ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకు..

తెలుగులో 'బిగ్ బాస్' ప్రస్థానం 2017లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలైంది. తారక్ తన వాక్చాతుర్యంతో షోకు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత నాని వచ్చినప్పటికీ, సీజన్ 3 నుంచి బాధ్యతలు చేపట్టిన 'కింగ్' నాగార్జున ఈ షోకు పర్మనెంట్ ఐకాన్‌గా మారిపోయారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో బుల్లితెరపై తన ముద్ర వేసిన నాగ్.. బిగ్ బాస్‌ను తనదైన శైలిలో నడిపిస్తూ అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిపెడుతున్నారు.

సీజన్ 9 సక్సెస్.. పెరిగిన డిమాండ్!

గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి టాస్కుల వరకు అన్నీ కొత్తగా ఉండటంతో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సక్సెస్‌తో నాగార్జున ఇమేజ్ మరింత పెరిగింది. ఫలితంగా పదో సీజన్ కోసం ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సినిమా కంటే బుల్లితెరపైనే ఎక్కువ సంపాదన?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. నాగార్జున గత ఏడు సీజన్లకు కలిపి దాదాపు రూ. 200 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే సగటున ఒక్కో సీజన్‌కు రూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం. సాధారణంగా నాగార్జున ఒక సినిమాకు రూ. 20 కోట్ల లోపు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాలీవుడ్ లో టాక్.. కానీ బిగ్ బాస్ కోసం ఆయన కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే కేటాయిస్తారు. తక్కువ పనిదినాల్లోనే సినిమాల కంటే ఎక్కువ ఆదాయం లభిస్తోందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

సీజన్ 10 కోసం రూ. 40 కోట్లు?

రాబోయే ' బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రతిష్టాత్మకమైనది కావడంతో.. అటు నాగార్జున కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క సీజన్ కోసం ఆయన ఏకంగా రూ. 40 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫిలిం నగర్ సమాచారం. ఇదే నిజమైతే, తెలుగు బుల్లితెర చరిత్రలో ఒక హోస్ట్ అందుకునే అత్యధిక పారితోషికం ఇదే అవుతుంది.

విమర్శలు ఉన్నా.. క్రేజ్ తగ్గలేదు!

మరోవైపు, బిగ్ బాస్ షోపై సాంప్రదాయవాదుల నుంచి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. షోను బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నా..  నిర్వాహకులు మాత్రం సీజన్ 10ని మరింత గ్రాండ్‌గా, మునుపెన్నడూ లేని విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ ఎంట్రీలు, వినూత్నమైన హౌస్ డిజైన్ ఉండబోతున్నాయని సమాచారం. మొత్తానికి, వివాదాలు పక్కన పెడితే.. కింగ్ నాగార్జున తన హోస్టింగ్‌తో షోను ఏ స్థాయికి తీసుకెళ్తారో, సీజన్ 10తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.