T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ జట్టు చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్‌పై గెలిచి, 12 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ టీమ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించినప్పటికీ, ఈ విజయంతో నేపాల్ క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. రోహిత్ పౌడెల్ నాయకత్వంలో ఆడిన నేపాల్ జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపించింది. స్టేడియంలో పెద్ద సంఖ్యలో హాజరైన నేపాల్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ గెలుపుని ఘనంగా జరుపుకున్నారు. చాలా మంది నేపాల్ ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన చేయగా.. ఒక ఆటగాడు మాత్రం తన ప్రత్యేకమైన సెలబ్రేషన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
నేపాల్ పేసర్ సోంపాల్ కామీ చేసిన ‘మహాదేవ్ ధ్యానం సెలబ్రేషన్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వికెట్ తీసిన వెంటనే మైదానంలో కూర్చొని, కాళ్లు మడిచి, చేతులు జోడించి ధ్యానం చేస్తున్నట్టుగా సంబరం చేసాడు. ఈ సెలబ్రేషన్‌పై అభిమానులు స్పందిస్తున్నారు. బౌలింగ్‌లో కూడా సోంపాల్ కామీ హీరోగా నిలిచాడు. స్కాట్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఒక దశలో వారు 200 పరుగులు దాటేలా కనిపించినా, నేపాల్ బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగ్గా ఉండటంతో స్కోర్‌ను అదుపులో పెట్టగలిగారు. స్కాట్లాండ్ తరఫున మైఖేల్ జోన్స్ 45 బంతుల్లో 71 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ టీం ధైర్యంగా బ్యాటింగ్ చేసింది. డిపేంద్ర సింగ్ ఐరీ కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి జట్టును విజయానికి దగ్గర చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. చివరకు నేపాల్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో నేపాల్ టీం టోర్నీ నుంచి నిష్క్రమించినా, తమ పోరాటంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటుంది. ప్రత్యేకంగా సోంపాల్ కామీ చేసిన సెలబ్రేషన్ ఈ మ్యాచ్‌కు మరింత హైప్ వచ్చేలా చేసింది.
