దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఒక విప్లవంలా పట్టణాల నుంచి పల్లెల వరకూ విస్తరించినప్పటికీ కరెన్సీ నోట్ల వాడకంలో స్పీడు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ప్రజల చేతుల్లో సర్క్యులేట్ అవుతున్న కరెన్సీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2026 జనవరి నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ ఏకంగా రూ.40 లక్షల కోట్ల మైలురాయిని తాకిందని రిజర్వు బ్యాంక్ తాజా రిపోర్టులో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11.1 శాతం ఎక్కువ. యూపీఐ లావాదేవీలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. భౌతిక కరెన్సీ వాడకం ఈ స్థాయిలో పెరగడం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గత దశాబ్ద కాలంగా కరెన్సీ నిల్వలను పరిశీలిస్తే ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. 2013లో రూ.11.8 లక్షల కోట్లుగా ఉన్న నగదు వాడకం.. నోట్ల రద్దు తర్వాత కొంత తగ్గినప్పటికీ కరోనా సమయంలో మళ్లీ పుంజుకుంది. 2021 మార్చి నాటికి రూ.28.5 లక్షల కోట్లకు చేరిన ఈ మొత్తం.. ఇప్పుడు రూ.40 లక్షల కోట్లకు చేరి రికార్డు సృష్టించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జీడీపీలో నగదు నిష్పత్తి 14.4% నుంచి 11.2%కి తగ్గింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుండటంతో నగదు వాటా శాతం తగ్గినట్లు కనిపిస్తున్నా.. వాస్తవంగా ప్రజల దగ్గర ఉన్న నోట్లు మాత్రం మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి.
ఈ నగదు పెరుగుదలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టులో కొన్ని కీలక కారణాలను వెల్లడించారు. ముఖ్యంగా పన్ను ఎగవేతదాడులు, జీఎస్టీ నోటీసులు ఒక ప్రధాన కారణంగా తేలింది. 2025 జూలైలో యూపీఐ లావాదేవీల ఆధారంగా సుమారు 18వేల మంది చిన్న వ్యాపారులకు నోటీసులు అందడంతో.. కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్ ఒక్కసారిగా పెరిగాయి. పన్ను భయంతో వ్యాపారులు మళ్లీ డిజిటల్ నుంచి క్యాష్ లావాదేవీల వైపు మళ్లినట్లు ఇది సూచిస్తోంది. అలాగే బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును దగ్గర ఉంచుకునే ట్రెండ్ పెరగడం కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి.
క్యాష్ వాడకం పెరిగిన వేళ మరోవైపు డిజిటల్ చెల్లింపులు కూడా రికార్డులు తిరగరాస్తున్నాయి. 2026 జనవరిలో ఒక్క నెలలోనే 2వేల170 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంటే రోజుకు సగటున 70 కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. కరెన్సీ నోట్లలో రూ.500 నోటు ఆధిపత్యం పెరగడం చూస్తుంటే.. ప్రజలు నగదును కేవలం ఖర్చుల కోసం కాకుండా పొదుపు కోసం ఎక్కువగా వాడుతున్నారని అర్థమవుతోంది. చిన్న నోట్ల వాడకం తగ్గి, డిజిటల్ సిస్టమ్ ద్వారా రోజువారీ చిన్న చిన్న చెల్లింపులు జరుగుతుంటే.. పెద్ద మొత్తంలో నగదు మాత్రం లాకర్లలో లేదా నిల్వ రూపంలో ప్రజల దగ్గర పెరుగుతోంది. ఇది దేశంలో 'డిజిటల్', 'క్యాష్' సమాంతరంగా ప్రయాణిస్తున్నాయనే వింత పరిస్థితిని క్రియేట్ చేసింది.
