- షెడ్యూల్డ్, 100 శాతం ట్రైబల్ గ్రామాలతో కలిసి లెక్కించడం వల్లే సమస్య
- మండల యూనిట్‌గానే సర్పంచ్ రిజ్వరేషన్లు
- రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా తీసుకుంటే తేడా
- గతంతో పోలిస్తే 8 జిల్లాల్లో బీసీలకు పెరిగిన స్థానాలు
- రిజర్వేషన్లపై సర్కార్ క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై పంచాయతీరాజ్‌శాఖ క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్డ్, 100 శాతం ట్రైబల్గ్రామాల్లో ఇతర వర్గాలకు రిజర్వేషన్లు ఉండవని, కానీ ఆ గ్రామ పంచాయతీలను కూడా కలిపి లెక్కించి బీసీలకు17 శాతమే రిజర్వేషన్లు వచ్చాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదని పేర్కొంది. వాస్తవానికి ఈ గ్రామాలను తీసేసి లెక్కిస్తే బీసీ రిజర్వేషన్లు 21.39 శాతంగా ఉన్నాయని స్పష్టంచేసింది. అంతేగాక మండలం యూనిట్‌గా సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేస్తే రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని బీసీ రిజర్వేషన్లు తగ్గాయనడం కరెక్ట్ కాదని అధికారులు పేర్కొన్నారు. ఎస్టీ గ్రామ పంచాయతీల సంఖ్య 2019 లో 1,177 ఉండగా 2025లో 1,248కి చేరాయని ఆ మేరకు బీసీ రిజర్వేషన్లు తగ్గాయని వెల్లడించారు. గత ఎన్నికల తర్వాత 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. దీనికితోడు పాత గ్రామ పంచాయతీలను విభజించడం ద్వారా 223 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా పంచాయతీల్లో బీసీ జనాభా నిష్పత్తిపై ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. 2019 తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, 50 శాతం సీలింగ్ కారణంగానూ రిజర్వేషన్లు స్వల్పంగా మారాయని, కానీ అదే సమయంలో ఏకంగా 8 జిల్లాల్లో గతంలో కన్నా బీసీ రిజర్వేషన్లు పెరిగాయని అధికారులు వివరించారు.
ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు..
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెరిగాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 12,751 గ్రామాల్లో10,293 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి. అందులో ఎస్టీలకు 688 సర్పంచ్ స్థానాలు (6.68 శాతం), ఎస్సీలకు 2,113 స్థానాలు(20.53 శాతం) పోగా.. బీసీలకు 2,345 స్థానాలు (22.78 శాతం) దక్కాయి. ఈసారి 12,760 గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్, 100 శాతం ఎస్టీ పంచాయతీలు పోగా, కేవలం10,233 నాన్ షెడ్యూల్డు జీపీలు మాత్రమే మిగిలాయి. ఇందులో ఎస్టీలకు 714 స్థానాలు(6.99 శాతం), ఎస్సీలకు 2,090 స్థానాలు (20.45 శాతం) పోగా.. బీసీలకు 2,186 స్థానాలు( 21.39 శాతం) దక్కాయి. షెడ్యూల్డ్, 100 శాతం ఎస్టీ గ్రామాల సంఖ్య పెరగడం వల్లే బీసీ రిజర్వేషన్లు తగ్గాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
8 జిల్లాల్లో పెరిగిన కోటా
రాష్ట్రంలో 2019 పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లతో పోలిస్తే 2025లో 8 జిల్లాల్లో బీసీ సర్పంచ్ స్థానాల సంఖ్య పెరిగింది. హనుమకొండ, జగిత్యాల, జనగామ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ల శాతం గణనీయంగా పెరిగినట్లు పంచాయతీరాజ్ నివేదికలో స్పష్టమైంది. ఉదాహరణకు హనుమకొండలో 2019లో 15.08 శాతం రిజర్వేషన్లు ఉండగా.. 2025లో 22.53 శాతానికి చేరింది. వనపర్తిలో 24.77 శాతం నుంచి 27.67 శాతానికి పెరిగింది.
బీసీ రిజర్వేషన్లు 2019లో, 2025లో ఇలా(శాతాల్లో)..
- జిల్లా 2019 2025
- హనుమకొండ 15.08 22.53
- జగిత్యాల 25.07 27.19
- జనగామ 17.05 18.59
- జోగుళాంబ గద్వాల 25.40 27.76
- కరీంనగర్ 23.40 26.75
- నిజామాబాద్ 21.35 26.64
- సూర్యాపేట 14.63 15.56
- వనపర్తి 24.77 27.67
