న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్ ఉత్సాహంగా సాగుతోంది. టోర్నీలో కరీబియన్ బిగ్ హిట్టర్లు కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్ ఫామ్‌లోకి వచ్చారు. ముఖ్యంగా పొలార్డ్ భారీ సిక్సర్లతో బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. పెద్ద గ్రౌండ్స్‌లో, భారీ సిక్సర్లతో బెంబేలెత్తిస్తున్న ఈ పించ్ హిట్టర్ల సక్సెస్ సీక్రెట్ రివీల్ అయింది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఈ రహస్యాన్ని చెప్పాడు. బ్యాక్ ఫుట్ పై వేచి ఉండటం ద్వారా భారీ సిక్సర్లు కొడుతున్నారని తెలిపాడు.
‘పేస్‌లో మార్పులు చేసే స్లో బౌలర్లకు ముందే కమిట్ అవ్వొద్దు. ఆ టైమ్‌లో బ్యాట్స్‌మన్ తన బరువును బ్యాక్ ఫుట్‌పై ఉంచాలి. అప్పుడే మరింత మెరుగ్గా కుదురుకోవచ్చు. స్లో బాల్స్ వేసినప్పుడు ముందే షాట్‌కు కమిట్ అవ్వొద్దు. పొలార్డ్ లేదా రసెల్‌ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ ఇద్దరూ క్రీజులో బాగా వెనక్కి జరిగి బాల్ కోసం వెయిట్ చేస్తుంటారు. బంతి రాగానే బలంగా కొడతారు. అది వారి విషయంలో బాగా పని చేస్తోంది’ అని సామి చెప్పాడు.

