V6 News

ఆరోగ్యమా.. అప్పుల కుప్పా? ఇన్సూరెన్స్ ఉన్నా ప్రైవేట్ వైద్యంతో జేబులకు చిల్లు..

ఆరోగ్యమా.. అప్పుల కుప్పా? ఇన్సూరెన్స్ ఉన్నా ప్రైవేట్ వైద్యంతో జేబులకు చిల్లు..

దేశంలో వైద్యం ఇప్పుడు సామాన్యుడికి తలకు మించిన భారంగా మారుతోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2025లో దాదాపు 1.4 లక్షల కుటుంబాలపై జరిపిన సర్వేలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాల కవరేజ్ ఉన్నా.. వైద్యం కోసం ప్రజలు తమ జోబుల నుంచి భారీగా ఖర్చు చేయక తప్పటం లేదని తేలింది. పైగా ఇది అంతకంతకూ పెరుగుతూ పోతోందని వెల్లడైంది. ముఖ్యంగా 2017-18తో పోలిస్తే 2025 నాటికి ఆసుపత్రి ఖర్చులు ఆకాశాన్ని తాకాయి.

ఒక్కసారి అడ్మిట్ అయితే..
సాధారణ ప్రసవాలు కాకుండా, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినప్పుడు సగటున ఒక భారతీయుడు తన జేబు నుండి రూ.34వేల 604 ఖర్చు చేయాల్సి వస్తోందట. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు చేసే సగటు ఖర్చు కంటే 1.64 రెట్లు ఎక్కువ. అంటే ఇంట్లో ఒకరికి అనారోగ్యం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటోందని ఈ డేటా స్పష్టం చేస్తోంది. ప్రసవం కోసం సగటున రూ.14వేల 755, చిన్నపాటి చికిత్సల కోసం రూ.861 వరకు ఖర్చు అవుతోందని తేలింది.

ప్రైవేట్ వైపు ప్రజల మొగ్గు..
ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రులపైనే ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో 45.7% మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేవారు. ఇప్పుడు అది 39.2%కి పడిపోయింది. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే 7.6 రెట్లు ఎక్కువగా ఉంది. 2017-18లో ఈ వ్యత్యాసం 6.8 రెట్లు ఉండేది. వైద్య ఖర్చుల పెరుగుదల రేటు ఆహార ధరల పెరుగుదల కంటే స్పీడుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇన్సూరెన్స్ ఉన్నా భారమే.. ఎందుకంటే?
ప్రభుత్వ పథకాల పుణ్యమా అని హెల్త్ ఇన్సూరెన్స్ కలిగిన వారి సంఖ్య భారీగా పెరిగింది. గ్రామాల్లో ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నవారు 14.1% నుంచి 47.4%కి, పట్టణాల్లో 19.1% నుంచి 44.3%కి చేరారు. వీరిలో అత్యధికులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే. అయితే ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్ టెస్టులు, మందులతో పాటు అదనపు ఖర్చుల రూపంలో ప్రజలు భారీగా సొంత డబ్బును వెచ్చించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ రీయంబర్స్‌మెంట్ తర్వాత కూడా మిగిలిన ఖర్చుల భారం కుటుంబాలపైనే పడుతోంది.

ప్రస్తుతం మన దేశంలో వైద్యం మరింత ప్రైవేటీకరణ చెందడమే కాకుండా.. సామాన్యుడు మోయలేనంత భారంగా మారుతోంది. ప్రభుత్వ పథకాలు కవరేజీని పెంచుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రైవేట్ దోపిడీ, పెరుగుతున్న వైద్య ధరల కారణంగా ఆరోగ్యం ఇప్పుడు ఒక ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అత్యవసర సమయంలో వైద్యం కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి దేశంలో నెలకొందని తాజా లెక్కలు హెచ్చరిస్తున్నాయి.