కుమ్ములాటలే కాంగ్రెస్ కొంపముంచినయ్

కుమ్ములాటలే కాంగ్రెస్ కొంపముంచినయ్

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీ కొంప ముంచినయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందే సీఎంను మార్చడం.. ఆ తర్వాతా అంతర్గత కుమ్ములాటలు కొనసాగడంతో పార్టీ చేజేతులా తన పుట్టిని తానే ముంచుకున్నట్లయింది. పంజాబ్ లో ఒకసారి అకాలీదళ్ ప్రభుత్వం వస్తే.. మరోసారి కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరేది.  కానీ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ సిద్ధూ రేపిన చిచ్చుతో సీఎం పదవి నుంచి అమరీందర్ సింగ్ ను తప్పించడం.. చరణ్ జిత్ సింగ్ ను గద్దెనెక్కించడం.. పార్టీని వీడి అమరీందర్ సింగ్ సొంత కుంపటి పెట్టుకోవడం.. ఆ తర్వాత కూడా సిద్ధూకు, కొత్త సీఎంకు పొసగకపోవడంతో పార్టీ గ్రూపు రాజకీయాలు తప్ప అసలు రాజకీయాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేకపోయింది. దీంతో  ‘కాంగ్రెస్‌‌ను కాంగ్రెస్సే ఓడించగలదు’ అంటూ సిద్ధూ గతంలో చేసిన కామెంట్సే ఇప్పుడు నిజమయ్యాయి. 2017 ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సిద్ధూ.. ఇప్పుడు ఓటమిలోనూ అంతే కీలక పాత్ర పోషించారు.  

ఆప్‌‌కు కలిసొచ్చిన అంశాలివే.. 

కాగల కార్యం గంధర్వులే తీర్చారని వెనకటికి ఒక సామెత. పంజాబ్‌‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు విషయంలోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్‌‌లో కుమ్ములాటలు, బీజేపీపై పంజాబ్‌‌లో వ్యతిరేకత, ఓట్లను చీల్చిన అమరీందర్, రాజకీయంగా చతికిలపడిన శిరోమణి అకాళీదళ్.. వెరసి కేజ్రీవాల్ పార్టీని గెలుపు వాకిట నిలబెట్టాయి. ఆప్‌‌కు అఖండ విజయాన్ని కట్టబెట్టాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కేజ్రీవాల్  కొత్త వ్యూహాన్ని అమలు చేయడం కలిసొచ్చింది. ఫోన్ కాల్స్ ద్వారా తమ పార్టీలోని ఒకరిని సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవాలని కార్యకర్తలను, ప్రజలను కోరారు. నిజానికి భగవంత్ సింగ్‌‌ మన్‌‌నే కీలక నేతగా ఉన్నా.. ఓటింగ్ ద్వారా ఆయన్ను ఎంపిక చేసినట్లు ప్రకటించి పాజిటివ్‌‌ పబ్లిసిటీ చేసుకున్నారు. మరోవైపు కెప్టెన్ అమరీందర్ సింగ్‌‌ను సీఎం పదవి నుంచి దించి కాంగ్రెస్ అవమానించింది. దీంతో ఆయన బయటికొచ్చి పార్టీ పెట్టుకుని పెద్దగా సాధించింది లేకపోయినా.. కాంగ్రెస్‌‌ను అంతో ఇంతో దెబ్బకొట్టారు. 

అగ్రి చట్టాలతో దెబ్బతిన్న బీజేపీ 

బీజేపీ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై పంజాబ్‌‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతు ఆందోళనలను పంజాబ్ రైతులే లీడ్ చేశారు. ఫలితంగా ఇక్కడ బీజేపీ పూర్తిగా దెబ్బతిన్నది. కాషాయ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు ప్రత్యామ్నాయంగా ఆప్‌‌ వైపు చూశారు.  

కాంగ్రెస్​కు మిగిలినయి రెండే రాష్ట్రాలు

దేశంలో కాంగ్రెస్​ గ్రాఫ్​ భారీగా పడిపోయింది. 2012 నాటికి 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. 2014లో కేంద్రంలో అధికారం కోల్పోవడంతోపాటు వరుసగా రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పూతూ వస్తున్నది. ప్రస్తుతం పంజాబ్​లో కూడా అధికారాన్ని చేజార్చుకొని రాజస్థాన్​, ఛత్తీస్​గడ్​కే పరిమితమైంది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లు ఇప్పుడు కేవలం 2శాతం ఓట్లే తెచ్చుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ ఎన్నికలను రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నప్పటికీ అక్కడే రెండే సీట్లు కాంగ్రెస్​కు దక్కాయి. వరుసగా 2014 నుంచి ఢిల్లీలో అధికార పగ్గాలు చేపడుతున్న ఆమ్​ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్​లోనూ పవర్​లోకి వచ్చి రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్​ను ఢీకొట్టింది.