స్థలమిచ్చారు.. ఇండ్లు కడుతుంటే అడ్డుకుంటున్నరు

స్థలమిచ్చారు.. ఇండ్లు కడుతుంటే అడ్డుకుంటున్నరు

శామీర్ పేట, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన తమకు 20 ఏండ్ల కిందట అప్పటి ప్రభుత్వం స్థలాలు ఇచ్చిందని..  ఇప్పుడు ఇండ్లు కట్టుకుందామంటే మున్సిపల్ అధికారులు అడ్డుకుంటున్నారని బాధితులు సోమవారం మేడ్చల్  కలెక్టరేట్​ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డికి, డీఆర్వో లింగ్యానాయక్‌‌కు కలిసి తమకు ఇచ్చిన పట్టాలను చూపారు. బాధితులు మాట్లాడుతూ..  మేడ్చల్ రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణలో 20 ఏండ్ల కిందట తమ ఇండ్లు కోల్పోతే ఉమ్మడి ఏపీలోని అప్పటి టీడీపీ  ప్రభుత్వం 270 మంది బాధితులకు పట్టాలిచ్చిందన్నారు. 200 మంది ఇండ్లు నిర్మించుకుంటే పట్టించుకోని ఆఫీసర్లు మా నిర్మాణాలను అడ్డుకుంటున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. మరోవైపు.. ఏండ్ల కిందట చట్టప్రకారం భూములను కొని చేసి అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం వక్ఫ్​ భూములంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బోడుప్పల్​కు చెందిన బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రతి ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్​లు కడుతున్నామని చెప్పారు. తమకు న్యాయం చేయకపోతే పిల్లాపాపలతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని బాధిత కుటుంబాలు హెచ్చరించాయి.