
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు
- ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. జూన్ 26న ఆయన ఇండియాకు రావాల్సి ఉండగా, ఓ వైపు రెడ్ కార్నర్ నోటీసులు, మరోవైపు కేసు తీవ్రత నేపథ్యంలో పోలీసుల విచారణకు సహకరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ నెల చివరి వారంలోనే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులతో ఆయన కుటుంబసభ్యులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఈ కేసులో దర్యాప్తును పోలీసులు స్పీడప్‌చేశారు.
ప్రభాకర్ రావుతో పాటు 6వ నిందితుడైన ఓ చానల్ ఎండీ శ్రవణ్ కుమార్ విచారణ కూడా కీలకం కానుంది. దీంతో వీరిని ఇండియాకు రప్పించేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. వీరిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా సెక్షన్ 73 సీఆర్పీసీ కింద ఆదేశాలిచ్చింది. దీంతో వీరిని ఇండియాకు రప్పించే ప్రక్రియను పోలీసులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, ఇంటర్‌పోల్‌కు రెడ్‌కార్నర్ నోటీసులకు సంబంధించిన సమాచారం అందించారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యే లోపు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే లుక్‌అవుట్ సర్క్యులర్ ఉండడంతో ఎయిర్‌పోర్టులోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తారు.