ఓట్ చోరీపై ప్రజాపోరాటం!.. మితిమీరుతున్న మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు

ఓట్ చోరీపై ప్రజాపోరాటం!.. మితిమీరుతున్న మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి.  కీలక ఉన్నతాధికారులతో  దేశంలోని స్వయం ప్రతిపత్తిగల  రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ,  అధికారాన్ని శాశ్వతం చేసుకునే కుట్రలకు బీజేపీ తెరలేపింది.  బీజేపీ అధికారం కోసం దొడ్డిదారి వెతుక్కుంది. 

ప్రజాక్షేత్రంలో ఓటమి ఖాయమని అంచనాకు వచ్చిన బీజేపీ గత లోక్​సభ,  పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం (ఈసీ) సహకారంతో అవకతవకలకు పాల్పడింది.  ఇదే తరహాలో తాజాగా బిహార్  శాసనసభ ఎన్నికల్లో కూడా ఈసీ సహకారంతో ఎన్డీఏ విజయం సాధించడంతో  ప్రజాస్వామ్యవాదులు పెదవి విరుస్తున్నారు. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని హరించివేస్తున్న తీరును  లోక్​సభ  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలు రుజువులతో సహా ఎప్పటికప్పుడు నిరూపిస్తుండడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం బెంబేలెత్తుతోంది.  లోక్​సభతోపాటు హర్యానా,  మహారాష్ట్ర,  బిహార్ శాసనసభ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టింది. 

 బీజేపీ  చేస్తున్న ‘ఓట్ చోరీ’పై  డిసెంబర్​లో  ఢిల్లీ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ‘ఓట్ చోరీ’పై 5 కోట్లకు పైగా సంతకాలు సేకరించిన కాంగ్రెస్ పార్టీ ఇకముందు మరింత దూకుడుగా నిరసన కార్యక్రమాలను  నిర్వహించనుంది.  

 ప్రజాగ్రహానికి  మహారాజ్యాలే  కుప్పకూలాయనే వాస్తవాలను గ్రహించలేని  మోదీ ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే కుట్రలతో  వ్యవస్థలన్నింటినీ కబంధహస్తాల్లో బంధించి ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోంది.  ఈసీ,ఈడీ, సీబీఐ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోంది.  ప్రజాస్వామ్యానికి ఊపిరైన ఎన్నికలను ఈసీ సహకారంతో బీజేపీ నీరుగారుస్తోంది.

వాస్తవాలు లేని బీజేపీ గెలుపులు

ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో వాస్తవాలకు విరుద్ధంగా గెలుస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.  బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈసీ,  బీజేపీ కుట్రలను కాంగ్రెస్ పసిగట్టింది.   బిహార్ రాష్ట్రంలో  ఓటర్ల జాబితా  ప్రక్షాళణ పేరుతో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) చేపట్టి బీజేపీ విధానాలను వ్యతిరేకించే వర్గాలకు సంబంధించిన దాదాపు కోటి మంది  ఓటర్లను తొలగించే కుట్రలకు తెరలేపింది. 

ఎన్నికల ముందు బిహార్​లో చేపట్టిన ‘సర్’ విధానాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్లమెంట్ వేదిక మొదలుకొని  దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. న్యాయస్థానం తలుపు తట్టింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గత  ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 16 రోజులు బీహార్ రాష్ట్ర 
వ్యాప్తంగా ‘ఓట్ అధికార్ యాత్ర’ చేపట్టి ‘ఓట్ చోర్ - గద్దీ చోడ్’ నినాదంతో  పర్యటించారు.

 రాహుల్ గాంధీకి సంఫీుభావంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ‘ఓట్  చోరీ’ని నిరసిస్తూ సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమాలను భారీగా చేపట్టి ఉద్యమించింది. ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్  చేపట్టిన  నిరసనలతో  దేశవ్యాప్తంగా ప్రజల్లో బీజేపీ ఎన్నికల మోసాలపై చైతన్యం వచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచినా అది అక్రమ విజయమనే భావన ప్రజల్లో నెలకొంది.

‘సర్’ పేరుతో ఈసీ అవకతవకలు

‘సర్’ పేరుతో బిహార్లో ఓట్లను తొలగించడంతోనే ఈసీ అవకతవకలు బట్టబయలయ్యాయి.  మొదట కోటి మంది వరకు ఓట్లను తొలగిస్తున్నట్టు ప్రచారం జరిగినా ప్రజావ్యతిరేకత,  న్యాయస్థానాలు మొట్టికాయలు వేయడంతో ఈసీ వెనక్కి తగ్గింది.  పలు సవరణల అనంతరం చివరికి  బిహార్లో 7.42 కోట్ల మంది ఓటర్లున్నట్టు ఈసీ జాబితా విడుదల చేసింది.  

గత జూన్​లో  65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించడంతో సవరించిన ఓటర్ల జాబితాను  వెబ్​సైట్​లో  పెట్టాలని కోర్టు ఆదేశించింది.  తొలగించబడిన ఓటర్లు ధ్రువపత్రాలు సమర్పించడంతో  వారిలో 21 లక్షల మందికిపైగా  ఓటర్లను తిరిగి జాబితాలో  చేర్చారు. 

‘సర్’ పై వ్యతిరేకత రావడంతో వెనకడుగేసిన  ఈసీ 21 లక్షల మందిని తిరిగి చేర్చడం సాధారణ విషయం కాదు. అయితే ఇంకా లక్షలాది మంది అర్హులు ఎన్నికల్లో  ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారనేది వాస్తవం.  బిహార్  రాష్ట్ర  శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే  కాంగ్రెస్  లేవనెత్తిన అక్రమాలతోనే ఎన్డీఏ  విజయం  సాధించిందని  స్పష్టమవుతోంది.  

పలు నియోజకవర్గాల్లో ‘సర్’ పేరుతో  తొలగించిన ఓట్లు ఎన్డీఏ గెలుపుకు దోహదపడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిహార్ రాష్ట్రం కంటే ముందే  లోక్​సభ,  హర్యానా, మహారాష్ట్ర  శాసనసభ  ఎన్నికల్లో  తప్పులతడకలను రాహుల్ గాంధీ  ఎత్తిచూపినా బీజేపీ కబంధ హస్తాల్లో ఉన్న ఈసీ వాటిని పట్టించుకోకపోవడంతో ఆ లోపాలు తిరిగి బిహార్​లో 

ఓటర్ల జాబితాలో పలు అక్రమాలు

హర్యానా, మహారాష్ట్ర  ఓటర్ల జాబితాలో  పలు అక్రమాలు, సమయం ముగిసాక భారీగా ఓటింగ్ నమోదు కావడం, సందేహాల నివృత్తికి  సీసీ కెమెరాల కోసం డిమాండ్ చేసినా స్పందించకపోవడం, వీవీ ప్యాట్లు లెక్కకు వెనకడుగు వేయడంతో వారి అవకతవకలు బయటపడకుండా ఈసీ బీజేపీకి వత్తాసు పలుకుతోందనేది స్పష్టమవుతోంది. 

 కర్నాటకలోని మహాదేవపురంలో బీజేపీ ఐదు రకాలుగా ఓట్ల చోరీ చేస్తుందని రాహుల్ గాంధీ గతంలో గణాంకాలతో నిరూపించారు.  ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరున్నర లక్షలకుపైగా ఓటర్లుండగా,  వాటిలో లక్షకుపైగా దొంగ ఓట్లే.  ఇక్కడ 11 వేలకుపైగా  డూప్లికేట్ ఓట్లున్నాయి.  తప్పుడు ఎపిక్ నెంబర్లతో  దొంగఓట్లు వేయించారు. ఇలాంటి తప్పుడు విధానాలతో  మహాదేవపురంలో  బీజేపీ లక్షకుపైగా మెజార్టీ సాధించడంతో  2024లో  ఆ పార్టీ  బెంగళూరు సెంట్రల్ లోక్​సభ స్థానాన్ని 32 వేలకుపైగా మెజార్టీతో  గెలిచింది. 

బీజేపీ అక్రమాలు ఒక్క బెంగళూరు సెంట్రల్​కే పరిమితం కాలేదు.  2024  లోక్ సభ  ఎన్నికల్లో  బీజేపీ 25కు పైగా ఎంపీ సీట్లను  33వేల కంటే తక్కువ మెజార్టీతోనే  గెలవడం ఆ పార్టీ చేస్తున్న ఓట్ల చోరీకి నిదర్శనం.  తాజాగా  రాహుల్ గాంధీ ‘హెచ్ ఫైల్స్’ పేరుతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాల్పడిన అక్రమాలను  రుజువులతో వెలికితీయడంతో ఈసీ, బీజేపీ ప్రజల ముంగిట దోషులుగా మిగిలారు. వాస్తవానికి హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’తో అడ్డుకున్న తీరును, దానికి ఎన్నికల సంఘం అందించిన సహకారాన్ని ఆయన ఆధారాలతో నిరూపించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ఓట్ చోరీ’ నిరసనలు

 ‘హెచ్ ఫైల్స్’ వివరాల ప్రకారం హర్యానా రాష్ట్రంలో బూత్ స్థాయిలో అక్రమాలు జరిగాయి. 2 కోట్ల ఓటర్లున్న హర్యానాలో  25 లక్షలకుపైగా  నకిలీ  ఓటర్లున్నారు. 5 లక్షలకుపైగా డూప్లికేట్ ఓటర్లు,  ఓటర్ల తప్పుడు చిరునామాలు, లక్ష మందికిపైగా  ఓటర్ల తప్పుడు ఫొటోల వివరాలను రాహుల్ గాంధీ బయటపెట్టారు. అంటే రాష్ట్రంలో ప్రతి 8 మంది ఓట్లలో ఒకటి నకిలీదే.  ఒక హర్యానా బీజేపీ నేత ఇంట్లో 66 ఓట్లు రిజిస్టర్ అయ్యాయి.  మరో ఇంట్లో 501 ఓట్లు ఉన్నాయి. ఒక ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నా ఈసీ చోద్యం చూస్తూ నకిలీ ఓట్లతో  బీజేపీ  గెలుపునకు దోహదపడింది.  

బిహార్ ఎన్నికల్లో ‘సర్’ ప్రక్రియ మొదలుకొని తుది ఓటింగ్ శాతం ప్రకటన వరకు ఈసీ నిర్వహణ లోపాలపై తాజాగా  మేధావులు కూడా స్పందించడం శుభపరిణామం. అధికారమే పరమావధిగా  మోదీ ప్రభుత్వం అక్రమ మార్గాల్లో పయనిస్తూ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారు. అయితే,  బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా  కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ   కేంద్ర ప్రభుత్వాన్ని, వారికి సహకరిస్తున్న అధికారిక యంత్రాంగాన్ని వదిలిపెట్టదు. వారిని పార్లమెంట్ వేదికగా నిలదీయడమే కాకుండా న్యాయ పోరాటానికి కూడా వెనుకాడదు. 

మన ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు.  కాబట్టి బీజేపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రజాపోరాటాన్ని ఎంచుకొని ‘ఓట్ చోర్ - గద్దీ చోడ్’ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణను భారీగా చేపడుతోంది.  

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ చోరీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలకు చేదోడుగా నిలుస్తారని ఆశిస్తున్నాం.

 –బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు–