- ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంటౌన్, వెలుగు : ప్రజలంతా చర్చించుకొని సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల వి. వెంకటాయపాలెంలో చేపట్టిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మంచుకొండ ఎత్తి పోతల పథకంలో ఉన్న మోటార్లకు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశామన్నారు. సంక్రాంతి నాటికి సబ్‌స్టేషన్ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. బుగ్గ వాగు నుంచి కామేపల్లి, రఘునాథ పాలెం మండలంలోని చెరువులకు నీరు పంపించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని, ఇందులో అంతర్ పంటలు సాగుచేస్తే అదనపు ఆదాయం సైతం వస్తుందన్నారు. గోద్రేజ్ సాయంతో ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని, ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, ఇందిరమ్మ చీరలు అందజేయాలని సూచించారు.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మహేందర్, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం. వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, పీఆర్ ఈఈ మహేశ్‌బాబు పాల్గొన్నారు.
