హనుమకొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ సోలార్ గ్రామాల అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి శుక్రవారం సాయంత్రం టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఎస్ఈలు, డివిజనల్ ఇంజినీర్లు, రెడ్కో ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని 37 గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి రైతు తన వ్యవసాయ అవసరాలకు సోలార్ విద్యుత్‌ను వినియోగించుకుని, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
మోడల్ సోలార్ గ్రామాల్లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, పనులు పూర్తయిన వెంటనే నెట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. సమావేశంలో డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు వెంకటరమణ, శ్రవణ్ కుమార్, అశోక్, జీఎంలు శ్రీనివాస్, మల్లికార్జున్, డీఈలు అమర్‌నాథ్, అనిల్ కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
