- ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించేందుకే.. ఇతర అవసరాలకూ వాడుకోవచ్చు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో మల్టీపర్పస్బ్యాగుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసే ఆరు గ్యారంటీల లోగో ముద్రించిన సంచుల్లో బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గత నెలలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావించినా.. జూబ్లీహిల్స్ఉప ఎన్నిక కారణంగా కోడ్అమలులో ఉండడంతో కుదరలేదు. ప్రస్తుతం కోడ్ఎత్తివేసిన నేపథ్యంలో వచ్చే నెల నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పొందే లబ్ధిదారులకు నాణ్యమైన, మందమైన బట్టతో ఉండే సంచుల్లో బియ్యం ఇవ్వనున్నారు.
ఇంతకు ముందు అమ్మ హస్తం పేరుతో..
గతంలోనూ తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్‌ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరుతో రేషన్‌షాపుల్లో బియ్యం, ఇతర కిరాణా వస్తువులు పంపిణీ చేసేవారు. దీనికి అప్పట్లో మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం సన్నబియ్యం పంపిణీకి మల్టీపర్పస్ బ్యాగులను వినియోగించాలని నిర్ణయించారు. ఈ సంచులపై సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల లోగోను స్పష్టంగా కనిపించేలా ముద్రించారు.
కాటన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకే..
ప్రస్తుతం రోజువారీగా ప్లాస్టిక్ వాడకం భారీగా పెరిగిపోయింది. షాప్‌కు, మార్కెట్‌కు , మాల్స్‌కు వెళ్లినప్పుడు ప్లాస్టిక్కవర్లలోనే సామాన్లు తెచ్చుకుంటున్నారు. ఈ రకంగా ఒక్కో వ్యక్తి తన ఇంటికి రోజూ పది నుంచి 12 ప్లాస్టిక్ కవర్లను తీసుకువెళ్తున్నట్టు ఒక సర్వే రిపోర్ట్ ఉంది. యూజ్ చేశాక తిరిగి చెత్తకుప్పల్లో పడేస్తుండడంతో పర్యావరణానికి ముప్పుగా పరిణమించింది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కాటన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం రేషన్ షాపుల్లో క్లాత్బ్యాగ్లలో బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటిని కూరగాయలు, ఇతర సామగ్రి తెచ్చుకునేందుకు కూడా ఉపయోగించవచ్చంటున్నారు.
8.28 లక్షలకు చేరిన రేషన్ కార్డులు
నగరంలో రేషన్‌కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఫిబ్రవరి నాటికి సిటీలోని తొమ్మది సర్కిళ్ల పరిధిలో 6,39,451 కార్డులున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. కానీ, ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకూ సిటీలో కొత్త 1,88,699 కార్డులను అందజేసింది. దీంతో ఇప్పుడు మొత్తం కార్డుల సంఖ్య 8,28,150 కు చేరింది. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా చెప్తుండడంతో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది.
