లోక సంచారి అందెశ్రీ ..కూర్చున్న చోటనే ప్రపంచం గురించి ఆలోచన

లోక సంచారి అందెశ్రీ ..కూర్చున్న చోటనే ప్రపంచం గురించి ఆలోచన

కూర్చున్న చోటనే ప్రపంచం గురించి ఆలోచిస్తారు..  కూసింత ఆలోచనతో ప్రయాణాలు చేస్తే అహంకారం పోతుంది. ప్రపంచాన్ని చూడటం వల్ల కళ్లకు కమ్ముకున్న పొరలు పోతాయి.  సహజ కవిగా, లంగాణ మట్టిబిడ్డగా పేరొందిన  అందెశ్రీ అన్నతో నా అనుబంధం చాలా ప్రత్యేకమైనది. 

అనూహ్యంగా  వారితో జరిగిన పరిచయం ఆ తర్వాత ఎంతో  బలపడింది.  ఆయనది ఒక ప్రత్యేక లోకం. ఎదుటి వ్యక్తులను అంత తొందరగా అంగీకరించని అందెశ్రీ ఒకసారి తనకు నచ్చితే మాత్రం అత్యంత  ప్రేమ,  ఆప్యాయతలు కురిపిస్తారు.  అది నా అనుభవం.  వాడుక భాషలో తేలికైన పదాలతో అప్పటికప్పుడు మాటలు కలిపి, పాటలు రాసే అరుదైన కవి అందెశ్రీ.  ముందుగా 2011లో నల్గొండలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ కు అన్నను హైదరాబాద్ నుంచి తీసుకువెళ్లిన సందర్భం  మా  తొలి పరిచయం.

అప్పటికే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండగా, అమెరికాతో పాటు వివిధ దేశాల్లో వి స్తరించిన  తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరమ్ కూడా తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేసింది.  టీడీఎఫ్ తరఫున అందెశ్రీని  అమెరికా తీసుకుపోయాం. నచ్చిన వ్యక్తులతోనే  జీవనం,  నచ్చిన ప్రదేశాల్లో తన మజిలీ కొనసాగించటం ఆయన ప్రత్యేకత. 

తిండిలో కూడా ఆయనది ప్రత్యేక పద్ధతి.  ఉదయమో, మధ్యాహ్నమో  వండినవి తినటాన్ని అస్సలు ఒప్పుకోరు. పరిమిత పదార్థాలు ఉన్నా,  అప్పటికి అప్పుడు వండిన అన్నం కూరలే తినేవారు. అందుకే అమెరికా వచ్చినా మిగతా కుటుంబాలతో అంతగా కలిసేవారు కాదు.  ప్రోగ్రామ్ కోసం ఎక్కడికైనా వెళ్లినా... అది అయిపోగానే వెంటనే  ఫోన్ చేసి లక్ష్మణా వచ్చి నన్ను తీసుకుపో అనేవారు. 

నదులు అంటే ఆయనకు అభిమానం!

అమెరికాలో ఉండగానే  నీళ్లు,  నదులపై ఆయనకు ఉన్న ఆరాటం బయటపడింది. ఆయన మొదటిసారి సినిమా పాట 2006లో జోగిని  వ్యవస్థపై తీసిన ‘గంగ’కు రాశారు. అందుకే ఆ గంగతో (తెలంగాణలో గోదావరి) పాటు అన్ని నదులపై ఆయనకు ప్రేమ పుట్టింది. వాక్కులమ్మ దయతో గంగనే నాకు గూడుతో పాటు, జీవితం ఇచ్చింది అనేవారు. అందుకే నది అంటే ఆయనకు అభిమానం. నదిని చూసినా, నీళ్లు కనిపించినా ఆయన కండ్లలో అంతులేని  ఆనందం  కనిపించేది.  

నది లోక నిధి కావ్యరచనకు పునాది పడింది అక్కడే. ప్రపంచ ప్రసిద్ధ నదులు పుట్టిన ప్రదేశాలతోపాటు, వాటి ప్రయాణం, సముద్రాల్లో సంగమ ప్రదేశాలను చూడాలని ఆరాటపడ్డారు. దీంతో ఆయన ఆశ, ఆశయాన్ని తీర్చేందుకు ప్రవాస తెలంగాణ వాసులం  నడుంకట్టాం. 

అమెజాన్​ నది వెంట...

నది నడిచి పోతున్నదమ్మ.. నన్ను నావనై రమ్మన్నదమ్మ అంటూ అన్ని ప్రపంచ  ప్రధాన నదులపై అందెశ్రీ కాలుమోపారు. బ్రెజిల్​లో ఉన్న అమెజాన్  నది పుట్టిన ప్రదేశంతో పాటు మిసిసిపి, నైలు, కాంగో, జాంబేజీ నదులను ఆయన స్పృశించారు. 

మిసిసిపీ నదికి అప్పట్లో అమెరికాలోనే ఉన్న వెదిరే శ్రీరామ్ తీసుకువెళ్లారు.  పది రోజులు పూర్తిగా అమెజాన్ నదిపై వందల కిలో మీటర్లు ప్రయాణమే.  నాలుగైదు, నెలలు అమెరికాతోపాటు  పలు దేశాల సంచారం.  నదులపై  ప్రయాణం, పరీవాహక ప్రాంతాల జీవనశైలి  అధ్యయనం ఒక జీవితకాలం అనుభవ పాఠాలు నేర్పింది. 

 నేను స్వయంగా ధైర్యం చేసి వ్యయప్రయాసలుకోర్చి ఆయన దక్షిణ అమెరికా యాత్రను ప్లాన్ చేయటంతోపాటు సహ ప్రయాణీకుడిగా వెళ్లే అదృష్టం దక్కించుకున్నాను. ఇలా అమెజాన్ ప్రయాణం నది పుట్టినచోట నుంచి సముద్రంలో కలిసేదాకా ప్రయాణం చేసిన మొదటి భారతీయులం మేమే అని అక్కడి స్థానికులు చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఆయన నైజం!

తనకు ఏది అనిపిస్తే అది చేయటం, అదే ఆచరించటం ఆయన నైజం. నచ్చినా, నచ్చకపోయినా మొహం మీదనే చెప్పేవారు.  ఓసారి కుటుంబంతో తిరుమలకు వెళ్లిన ఆయనకు అప్పటి  ఈవో  ప్రత్యేకంగా  శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తీరా దర్శనం తర్వాత పూజారి దేవుడికి దండం పెట్టుకోమని కోరితే, దేవుడికి నమస్కారం చేసి, పక్కనే ఉన్న భార్య పాదాలకు నమస్కరించారట. 

దీంతో  ఆశ్చర్యపోయిన పూజారులు ఇదేమిటని అడిగితే,  తనను భరించి సేవచేసిన తన భార్యే తనకు  దేవుడు, దేవత అన్నారట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. వాస్తవానికి అందెశ్రీకి  ఆరోగ్యంపై శ్రద్ధ బాగానే ఉండేది. ఎప్పుడు అమెరికాలో ఉన్నా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయటంతోపాటు, కాసేపు శ్వాసతో పాటు, యోగాసనాలు చేసేవారు. అలాంటి ఆయన చివరలో అరోగ్యాన్ని అశ్రద్ధ చేశారని, బీపీ మందులు వేసుకోలేదనే వార్తను మేం జీర్ణించుకోలేకపోయాం. 

మట్టిబిడ్డకు దక్కిన గొప్ప గౌరవం

ఎట్ల పుట్టినం, ఎట్ల బతికినం అనేది ముఖ్యం కాదు,  పోయేటప్పుడు ఎలా పోయాం అనేదే ముఖ్యం. ఈ విషయంలో అందెశ్రీ అన్న అత్యంత అదృష్టవంతుడు.  హఠాత్తుగా అందరికీ దూరమైనా ఆయన చావు మాత్రం గొప్పగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా పాడె మోయటం, మంత్రులంతా హాజరుకావటం, తెలంగాణ  సమాజం అంతా తమ ఇంట్లో వ్యక్తిని కోల్పోయినట్లుగా బాధపడటం, తెలంగాణ మట్టిబిడ్డకు దక్కిన అసాధారణ గౌరవం. 

జీవితమంతా పేరుకు పేదరాజులా బతికిన అందెశ్రీ ఆఖరిమజిలీ మాత్రం అతి గొప్పగా అధికారిక లాంఛనాలతో జరిగింది. ఒక ప్రజాకవికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది. ఆయన ఆశించి, ఆశపడిన ఆ ఇల్లు ఒక్కటి పూర్తయితే అన్న కుటుంబానికి మరింత ఊరట దక్కేది. అందెశ్రీ అన్న ఇక లేరు, మళ్లీ రారు అన్న చేదు నిజం అబద్ధమయితే బాగుండు. జయ జయహే తెలంగాణ.. రూపంలో ఆయన  వదిలిన గుర్తులు  భావితరాలకు అందేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం, అనుబంధం ఉన్న సంస్థలు, వ్యక్తులు  పాటుపడాలని కోరుకుంటున్నాం.

- లక్ష్మణ్ ఏనుగు,మాజీ అధ్యక్షుడు, టీడీఎఫ్, న్యూయార్క్, అమెరికా -