
- కేజ్రీవాల్‌కు బెయిల్‌పై సుప్రీంకోర్టు కామెంట్
- బెయిల్ ఇవ్వడాన్ని సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్ షా వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయర్
- తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తున్నామని తెలిపింది. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం మరోసారి విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘ఆప్ కు ఓటు వేస్తే, జూన్ 2న తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతున్నారు. ఇది బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడమే’ అని అన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ.. ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
‘‘కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడం సాధారణ తీర్పులాగా భావించట్లేదు. కేజ్రీవాల్ కామెంట్లు కోర్టు ధిక్కారం కిందికే వస్తాయి. ఒకవేళ ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే, వాళ్లు తప్పు చేసినా కోర్టు జైలుకు పంపదన్న రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిన జడ్జీలు గమనించాలి” అని ఓ కేంద్రమంత్రి మాట్లాడారంటూ సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు స్పందిస్తూ.. ‘‘మేం ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అది ఆయన (కేజ్రీవాల్) ఊహ మాత్రమే. దీనిపై మాట్లాడడానికి ఏమీ లేదు. ఆయనకు బెయిల్ ఎందుకు ఇచ్చామో తీర్పులో స్పష్టంగా పేర్కొన్నాం. జూన్ 2న లొంగిపోవాలని కూడా చెప్పాం. ఆ ఆర్డర్ ప్రకారమే చట్టపాలన ఉంటుంది. మా తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తాం. వాటి జోలికి మేం వెళ్లం” అని పేర్కొంది.