ఫారెస్ట్ రోడ్లకు అడ్డంకులు

ఫారెస్ట్ రోడ్లకు అడ్డంకులు
  • మారుమూల పల్లెల రోడ్లకు లభించని ఫారెస్ట్​ క్లియన్స్​
  • మంజూరైన నిధులు వెనక్కి మళ్లింపు
  • ఏటా వర్షాకాలంలో తప్పని కష్టాలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణం లేక ఆయా ప్రాంతాల ప్రజలు కాలి బాటనే నమ్ముకుని రాకపోకలు సాగిస్తున్నారు. తండాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వర్షాకాలంతో పాటు వేసవి, శీతాకాలంలో సైతం రోడ్డు సౌకర్యం లేక అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నారు. పల్లెలన్నీ రిజర్వ్ ఫారెస్ట్ సమీప ప్రాంతాల్లో ఉండడంతో అటవీ శాఖ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నప్పటికీ వాటికి మోక్షం లభించడం లేదని చెబుతున్నారు.

ముఖ్యంగా కడెం, పెంబి, ఖానాపూర్, మామడ, సారంగాపూర్ మండలాల్లోని గ్రామాల రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ. 24 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరైనప్పటికీ అటవీ అనుమతుల రాకపోవడంతో పనులు మొదలుకాలేదని ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీరాజ్, ఐటీడీఏ ఆధ్వర్యంలో..

కడెం మండలం ధర్మాజీపేట నుంచి లక్ష్మీ సాగర్ వెళ్లే మారుమూల ప్రాంత రోడ్డుకు, మాసాయిపేట నుంచి అక్కకొండ ఆలయానికి వెళ్లే రోడ్డు అనుమతుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త మద్దిపడగ గ్రామానికి రోడ్డు మంజూరైనప్పటికీ అటవీ అనుమతులు లభించలే దు. దీంతో పాటు పీఎంజీఎస్​వై కింద పెంబి మండలం రాసి మెట్ల నుంచి కొరటికల్ వరకు 6 కిలోమీటర్ల మేర అటవీ అనుమతులు రావాల్సి ఉంది. ఇదే మండలంలోని ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి కొసగుట్ట వరకు, ఖానాపూర్ మండలం ఎర్వచింతల నుంచి దతోజిపేట్ వరకు, కడెం మండలంలోని ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి అల్లంపల్లి వరకు 9 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రోడ్డుకు అట వీశాఖ అనుమతులు జారీ చేయడం లేదు. 

కాగితాలకే పరిమితం..

ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్న రోడ్లకు సైతం మోక్షం లభించడం లేదు. కడెం మండలం పాండవాపూర్ నుంచి డ్యామ్ గూడ గ్రామానికి రూ. కోటి 20 లక్షలు మంజూరయ్యాయి. ఒకటిన్నర కిలో మేర నిర్మించాల్సిన రోడ్డుకు అటవీ అనుమతులు జారీ చేయాల్సి ఉంది.  ఇదే మండలంలోని రాయదారి గ్రామం నుంచి గోధుమల వరకు నిర్మించే రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరైనప్పటికీ అటవీ అనుమతులు లభించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 20 కోట్ల ప్రతిపాదనలు, ఐటీడీఏ పరిధిలో రూ.3 కోట్ల 20 లక్షల ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు అటవీ అనుమతులు రాకపోవడంతో అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని చెబుతున్నారు. 

రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నాం..

మాసాయిపేట నుంచి అక్కకొండ వరకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. అటవీశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. - మందపల్లి రమేశ్, ఎలగడప గ్రామస్తుడు

రోడ్డుపై నడవలేక పోతున్నాం..

తమ గ్రామానికి మంజూరైన రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు మొదలు కాలేదు. ఈ రోడ్డుపై నడవలేక అవస్థలు పడుతున్నాం. ఏళ్ల నుంచి తమ సమస్యను పరి ష్కరించడం లేదు. వర్షాకాలంలో తమ ఊరు నుంచి ఇంకో ఊరికి పోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అటవీ శాఖ అనుమతులు సాధించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి. దుల్లే వెంకటేశ్, కొత్త మద్ది పడగ, కడెం మండలం