త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు

 త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
  •     పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు 
  •     కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ
  •     ప్రాసెస్​ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం 
  •     పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 2010 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లందరికీ టెట్​తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మధ్యలో ఆగిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను తిరిగి వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పర్మిషన్ కోసం రెండుమూడు రోజుల్లో ఈసీకి లేఖ రాయనున్నారు. టెట్ నిబంధనతో నిలిచిన ప్రక్రియ రాష్ట్రంలో అర్హులైన టీచర్లకు బదిలీలతోపాటు ప్రమోషన్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది.  సుమారు 10వేల మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. 

ఈ క్రమంలో మల్టీజోన్ –1, మల్టీజోన్– 2 పరిధిలో గవర్నమెంట్, లోకల్ బాడీ మేనేజ్​మెంట్​లోని హెడ్​మాస్టర్లకు బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న హెడ్​మాస్టర్​ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో భర్తీకి చర్యలు ప్రారంభించింది. మల్టీజోన్ –1లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. అప్పట్లో మల్టీజోన్ –1లో గవర్నమెంట్ హైస్కూళ్లలో 97 మంది, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 985 మందికి, మల్టీజోన్– 2లో గవర్నమెంట్ హైస్కూళ్లలో 141 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్​మాస్టర్లుగా పోస్టింగ్​లు ఇచ్చారు. ప్రమోషన్లకు టెట్ అర్హత ఉండాలనే నిబంధన అమలు చేయాలని, ఇతర కారణాల నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో మల్టీజోన్ –2లో జిల్లా పరిషత్ హైస్కూళ్లకు చెందిన స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి టెట్ అర్హతపై హైకోర్టులో కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవల 2010 ఆగస్టు 23 కు ముందే నియామకమైన టీచర్లకు టెట్ తో నిమిత్తం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

దీంతో పాటు పాఠశాల స్థాయి మారిన వారికి మాత్రమే టెట్ అవసరమని ఎన్​సీఈటీ ప్రకటించింది. దీంతో ప్రమోషన్లకు వచ్చిన సమస్యలు క్లియర్ అయినట్టేనని విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో జూన్ మొదటివారం వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. అనుమతి వస్తే.. వెంటనే గతంలో ఆగిపోయిన హెడ్​మాస్టర్​ పోస్టుల ప్రమోషన్ ప్రక్రియ నుంచి కొనసాగించేందుకు సర్కారు రెడీ అయింది. ఒకవేళ పర్మిషన్ రాకపోతే, జూన్ 4 తర్వాతే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగించేలా ప్లాన్ చేస్తోంది. దీంతో టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని వినతి

నిలిచిపోయిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని టీచర్ల సంఘాల నేతలు కోరారు. పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు, యూఎస్​పీసీ, జాక్టో నేతలు చావ రవి, జంగయ్య,  సదానందం, కృష్ణుడు, అశోక్ కుమార్, లింగారెడ్డి తదితరులు విద్యాశాఖ సెక్రెటరీ బుర్రా వెంకటేశంను వేర్వేరుగా కలిసి, వినతిపత్రాలు అందించారు. వేసవి సెలవులు పూర్తవుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని టీచర్​ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీచర్​ యూనియన్​ నేతలు.. సీఎంని కలిసి, విజ్ఞప్తి చేశారు. 

ప్రమోషన్లతో నింపనున్న పోస్టులు 

  • హెడ్​మాస్టర్​ పోస్టులు – 2,013 
  • ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు– 2,130
  • స్కూల్ అసిస్టెంట్ పోస్టులు –5,563