పునరావాసం కల్పించక ‘గుండెగాం’ వాసుల కష్టాలు

పునరావాసం కల్పించక ‘గుండెగాం’ వాసుల కష్టాలు

భైంసా, వెలుగు: వానాకాలం వచ్చిందంటే చాలు ఆ ఊరంతా నీరే. కట్టుబట్టల నుంచి తినే తిండి, వస్తువులు, గొడ్డు గోదా.. ఇలా అంతా వరద నీటితో సావాసం చేయాల్సిందే. ఇదీ నిర్మల్​ జిల్లా భైంసా మండలం గుండెగాం గ్రామస్తుల గోస. ఈ గోస ఎన్నడు తీరుతదో అని ఏడేండ్లుగా ఎదురుచూస్తున్న గుండెగాం వాసులకు నిరాశే దిక్కవుతోంది.  రంగారావు పల్సికర్​ ప్రాజెక్టు బ్యాక్​వాటర్​తో ప్రతి యేటా గుండెగాం గ్రామం ముంపునకు గురవుతూనే ఉంది. దీన్ని తలుచుకున్నప్పుడల్లా అక్కడి జనాల గుండెలు బాధతో బరువెక్కుతాయి. పునరావాసం ఎదురుచూస్తూ.. తమ గోస తీరే దారేదోనని వెయ్యి కండ్లతో ఆ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. పునరావాస ఫైలు ఏండ్లుగా పెండింగ్​పడటంతో గ్రామస్తులు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. ఈ యేడు కూడా వరదనీటితో సావాసం చేయాల్సిందేనా అని ఆగ్రహిస్తున్నారు. 

ప్రతి యేడు అదే పరిస్థితి... 

వర్షాకాలం స్టార్టయినప్పటి నుంచి ముగిసే దాకా గుండెగాం గ్రామస్తుల గోస అంతా ఇంతా కాదు. ఒకట్రెండు వానలు పడితే చాలు ఊళ్లోకి నీరు వచ్చి చేరుతుంది. రంగారావు ప్రాజెక్టు వద్ద కట్ట ఎత్తు తెంపినా కూడా ఈ ఊరు ఇంకా నీటిలో మునిగే ఉంటది. ఊరి పక్కన నిర్మించిన వంతెన ఎటుకాకుండా ఉండడంతో వరద నీరు గ్రామంలోకి చేరుతోంది. వరద నీటితో వందలాది ఎకరాల పొలాలు, పదుల సంఖ్యలో ఇండ్లు దెబ్బతింటున్నాయి. రాత్రిపూట అందరూ నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇండ్లలోకి వరద నీరు రావడంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన సందర్భాలూ ఉన్నాయి. ఆ సమయాల్లో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు వచ్చి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్తున్నారే గానీ ఆ తర్వాత పట్టించుకున్న వారు లేరు. గతేడాది 180 కుటుంబాలు ఇండ్లను వదిలి భైంసాలో కొత్తగా నిర్మించిన డబుల్​బెడ్​రూంలలో తాత్కాలికంగా నివాసముంటున్నారు. ఈ ఏడేండ్లలో జరిగిన నష్టానికి ఈ గ్రామస్తులకు ఒక్కపైసా పరిహారం కింద రాలేదు. 

జాగా ఎంపిక ఏమైనట్టు...

ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్​కుమార్, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్​నిర్మల్​ జిల్లా పర్యటనకు రాగా.. ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి గుండెగాం పునరావాస సమస్యను విన్నవించారు. దీంతో పునరావాసానికి జాగా ఎంపిక చేయాలని, వానాకాలం స్టార్టయ్యే నాటికి ముంపు గోస లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్​ముషారఫ్​ ఆలీకి వారు ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. వానాకాలం దగ్గరికొచ్చినా అడుగు ముందుకు పడకపోవడంతో ఈ యేడు వరదలతోనే సావాసం చేయాల్సిందేనా అని గ్రామస్తులు వణికిపోతున్నారు. నాలుగేళ్ల క్రితమే పునరావాసంపై రెవెన్యూ, ఆర్అండ్​బీ, అగ్రికల్చర్, ఎలక్ర్టిసిటీ డిపార్ట్​మెంట్ల నుంచి ఎస్టిమేషన్స్​సిద్ధం చేసి సర్కారుకు అందజేశారు. అయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. 

ఆఫీసర్లు, లీడర్లు వచ్చి పోతుండ్రు కానీ...  

మా గ్రామం ఎన్నో ఏండ్లుగా రంగారావు ప్రాజెక్టు బ్యాక్​వాటర్​తో మునిగిపోతూనే ఉంది. గత నాలుగేండ్లుగా పూర్తిగా మునిగి చాలా నష్టం పోతున్నాం. ఊరు మునిగినప్పడు ఆఫీసర్లు, లీడర్లు వచ్చి ఇది చేస్తాం.. అది చేస్తామని చెప్పి పోతుండ్రు. కానీ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. ఈ యేడు కూడా మునక గోస తప్పదేమో.
- పవార్​ రాహుల్​, గుండెగాం వాసి
సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం
గుండెగాం గ్రామస్తుల పునరావస సమస్యను సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లాను. ఈ యేడు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. పునరావాస సమస్య పరిష్కారానికి ఆఫీసర్లతోనూ చర్చిస్తున్నాం.  గ్రామస్తులకు ముంపు గోస రాకుండా చూస్తాం.
- ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి