- రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా పార్క్‌లో ఘటన
- ఓ మహిళ సహా ముగ్గురు విదేశీ ఆర్టిస్టులకు గాయాలు
- నిలకడగా వారి ఆరోగ్య పరిస్థితి
- నిందితుడి అరెస్టు.. కత్తి స్వాధీనం
- ఎందుకు దాడి చేశాడనే దానిపై పోలీసుల ఆరా
సౌదీ ఆరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా పార్క్ అది.. స్టేజ్‌పైన మ్యూజికల్ పర్ఫార్మెన్స్ జరుగుతోంది. గోల్డ్ కలర్ డ్రస్సుల్లో ఉన్న విదేశీ కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారు. ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో పదునైన కత్తి పట్టుకుని ఓ వ్యక్తి స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. చూస్తుండగానే ముగ్గురిని పొడిచాడు. దీంతో హాల్లో కలకలం రేగింది. కళాకారులు, ప్రేక్షకులు పరుగులు తీశారు. దుండగుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు లైవ్‌లో రికార్డయ్యాయి. ఎంటర్టైన్మెంట్, ఇతర రంగాల విషయంలో సౌదీలో వందల ఏళ్ల నాటి ఆంక్షలను సడలించిన తర్వాత జరిగిన తొలి ఘటన ఇది.
రియాద్: సౌదీ అరేబియాలో ఇటీవలి కాలంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ఆడవాళ్లు డ్రైవ్ చేయడానికి లైసెన్స్ ఇచ్చారు. తర్వాత మహిళలు ఫుట్‌బాల్ మ్యాచులు చూడటానికి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మ్యూజిక్ ప్రోగ్రాంలకు వెళ్లొచ్చని అనుమతులు ఇచ్చారు. సౌదీకి వచ్చే విదేశీ మహిళా టూరిస్టులు బుర్ఖా వేసుకోవడంపైనా మినహాయింపు ఇచ్చారు. సౌదీ అరేబియాకు సంబంధించినంత వరకు ఇవి మామూలు నిర్ణయాలు కావు. దేశంలో టూరిజంను అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఈ మార్పులను తీసుకొచ్చారు. కేవలం ఆయిల్ నిల్వల మీద ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడి, ఇతర రంగాల ద్వారా దేశ ఎకానమీని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే రిఫార్మ్స్తీసుకువచ్చారు. ఇందుకోసం ‘విజన్–2030’ని డిక్లేర్ చేశారు. ఈ మార్పులకు ప్రధాన కారణం సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్. అయితే ఆయన నిర్ణయాలపై అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత, ఆర్థిక పురోగమనం నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు చేపట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కత్తి దాడి జరిగిందని మతాధికారులు, మేధావులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..
‘‘రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా పార్క్‌లో ఒక విదేశీ థియేటర్ ట్రూప్ తమ ప్రదర్శన ఇస్తోంది. ఒకవ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేశాడు. స్టేజి పైకి దూసుకొచ్చి కత్తితో పొడిచేశాడు. ఈ దాడిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళకు గాయాలయ్యాయి” అని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలో దుండగుడు దూసుకెళ్లడం, పోట్లు పొడుస్తూ అతడు జారి కిందపడటం, కళాకారులు అతడిని తప్పించుకుని పరిగెత్తడం కనిపించింది. దాడి చేసిన వ్యక్తి 33 ఏళ్ల యెమన్ పౌరుడు అని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతడు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం స్టేబుల్‌గానే ఉందని డాక్టర్లు చెప్పారు. కళాకారులు ఏ దేశానికి చెందిన వాళ్లు, దాడి చేసిన వ్యక్తి ఉద్దేశం ఏంటి అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

