కూలీలుగా మారిన సెక్రటరీలు

కూలీలుగా మారిన సెక్రటరీలు
  • ఎంపీఓ ఆదేశాలతో నర్సరీల్లో పనులు
  • సంగారెడ్డి జిల్లాలోఆఫీసర్ల తీరుపై విమర్శలు

సంగారెడ్డి, వెలుగు: పంచాయతీ సెక్రెటరీలు కూలీలుగా మారిన్రు. క్షేత్రస్థాయిలో కూలీలు లేకపోవడంతో సెక్రటరీలే కూలీ పనులు చేయాలని ఆఫీసర్లు ఆర్డర్​ వేసిన్రు. దీంతో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని 30 మంది సెక్రటరీలు నర్సరీల్లో పనిచేస్తున్నరు. మట్టితో బ్యాగులు నింపుతూ కూలి పనిచేస్తున్నారు. ఇప్పటికే సవాలక్ష పనులతో సతమతమవుతున్న పంచాయతీ సెక్రెటరీలకు కూలిపనులు కూడా అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..  మునిపల్లి మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఈ నెల 3న ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్​స్టాఫ్​తో ఆఫీసర్లు మీటింగ్​ ఏర్పాటుచేశారు. ఫీల్డ్​ లెవల్​లో ఎదురవుతున్న సమస్యల గురించి సెక్రటరీలు ప్రస్తావించగా, ఆఫీసర్లు, కార్యదర్శుల మధ్య వాగ్వాదం జరిగింది. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ ల్లో పనిచేసేందుకు  కూలీలు రావడం లేదని సెక్రటరీలు చెప్పారు.  కూలీలు దొరక్కపోతే మీరే కూలి పని చేయాలని స్థానిక ఎంపీఓ అంజనీదేవి మౌఖికంగా ఆదేశాలిచ్చారు. కూలిపనిచేయకపోతే చర్యలు తప్పవని ఎంపీఓ హెచ్చరించడంతో గత్యంతరం లేక నర్సరీ పనులు చేస్తున్నామని సెక్రటరీలు చెబుతున్నారు.

మొగ్దుంపల్లి నుంచి షురూ

ఎంపీఓ తీరుతో మునిపల్లి మండలంలోని 30 మంది కార్యదర్శులు ఏకమై కూలీల సమస్య ఉన్న గ్రామాల్లో శుక్రవారం నుంచి నర్సరీ బ్యాగ్ ఫిల్లింగ్​ పనులు మొదలుపెట్టారు. శని, ఆదివారాల్లో మొగ్దుంపల్లి గ్రామంలోని నర్సరీలో కవర్లు నింపుతూ కనిపించారు. ఈ విషయమై సదరు ఎంపీఓ అంజనీదేవిని వివరణ కోరగా.. ప్రజాప్రతినిధులు, సెక్రటరీలతో సమన్వయం చేసుకుని మునిపల్లి మండలాన్ని జిల్లాలోనే ముందుంచాలనే ఆలోచనతో పని చేయిస్తున్నామని చెప్పారు.