స్కూల్ బస్సులు పాటించాల్సిన రూల్స్ ఇవే.. పేరెంట్స్ మీరు కూడా చెక్ చేసుకోండి

స్కూల్ బస్సులు పాటించాల్సిన రూల్స్ ఇవే.. పేరెంట్స్ మీరు కూడా చెక్ చేసుకోండి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే, గ్రేటర్ పరిధిలో స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్ పరీక్షలకు ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. మరికొద్ది రోజుల్లో విద్యా సంస్థలు తెరవనున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. కానీ, ఇప్పటి వరకు 40 శాతం వాహనాలు కూడా ఫిట్​నెస్​ పరీక్షకు రాలేదు. 

ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న స్కూల్​ బస్సుల్లో15 ఏండ్లు పూర్తయినవే ఎక్కువగా ఉన్నాయని, తనిఖీలకు కూడా రాకపోవడంతో ఈనెల 15 తర్వాత తనిఖీలు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆర్టీఏ రూల్స్​కు విరుద్ధంగా ఉన్న బస్సులను రోడ్లపై తిరగనివ్వమని అంటున్నారు. అయితే, కొందరు అధికారులు స్కూల్​ మేనేజ్​మెంట్లు ఇచ్చే ముడుపులను తీసుకుని చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారని, అందుకే ఫిట్​నెస్​ లేక పోయినా ధీమాగా ఉంటున్నారని తెలుస్తోంది.  

స్కూల్ బస్సులు ఈ రూల్స్​పాటించాలి 

స్కూల్స్, కాలజీల వాహనాలు ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ పొందాలంటే కొన్ని ప్రమాణాలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్​సర్టిఫికెట్ ఉండాలి. పర్మిషన్​ఇచ్చిన కెపాసిటీ మేరకే విద్యార్థులను ఎక్కించుకోవాలి. డ్రైవర్​కు లైసెన్స్​ఉండడంతో పాటు ఎక్స్​పీరియన్స్​కూడా ముఖ్యమే. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్​మెంట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటివి ఉండాలి. బస్సు కిటికీలకు ఇరువైపులా 3 అంగుళాలకు మించకుండా పైపులను అమర్చాలి. వాహనాల బ్రేకులు, టైర్లు, లైట్లు కండీషన్​లో ఉండాలి. విద్యార్థులను ఎక్కించడం, దించడం లాంటివి చూసుకోవడానికి బస్సులో అటెండర్‌‌‌‌‌‌‌‌ ఉండాలి.

స్టూడెంట్స్​సులభంగా ఎక్కి దిగడానికి సరైన విధంగా మెట్లు ఉండేలా చూసుకోవాలి. కిటికీల నుంచి చేతులు, తలబయటకు పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. డ్రైవర్ 60 ఏండ్లలోపు ఉండాలి. ఇవే కాకుండా15 ఏండ్లు పూర్తి చేసుకున్న వాహనాలను రోడ్లపై నడపడానికి వీల్లేదు. ఈ రూల్స్​పాటించకపోతే ఆ వాహనాలను సీజ్​చేస్తారు. ఎంవీ యాక్ట్​ప్రకారం ఓనర్లు, డ్రైవర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తారు. తల్లిదండ్రులు కూడా ఈ అంశాలను చూడాలని అధికారులు సూచిస్తున్నారు.