పబ్లిక్ టాయిలెట్లలో దొంగలు పడ్డారు

పబ్లిక్ టాయిలెట్లలో దొంగలు పడ్డారు
  • నిఘా పెట్టి పట్టుకోవాలంటూ ఆదేశించిన మంత్రి కేటీఆర్ 
  •  గ్రేటర్ ఎన్నికలప్పుడు హడావిడిగా రోడ్లపై ఏర్పాటు
  • కొద్దిరోజులకే నిరుపయోగంగా వేల టాయిలెట్లు
  • పైపులు, నల్లాలు, వాటర్ ట్యాంకర్లు, కమోడ్లు మాయం
  • దొంగల పనేనని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లోని పబ్లిక్ టాయిలెట్లలో  దొంగలు పడ్డరు. పైపులు, నల్లాలు, వాటర్ ట్యాంకర్లు, కమోడ్లు, ఫ్లష్ డోర్ల  లాంటి వాటిని ఎత్తుకెళ్లారు. దీంతో వారిపై బల్దియా నిఘా పెట్టింది. దొంగలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం డ్యామేజ్అయిన టాయిలెట్లను రిపేర్ చేయించే పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఇటీవల అధికారులతో మున్సిపల్ మంత్రి సమావేశమై సిటీలోని టాయిలెట్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టాయిలెట్లలోని సామగ్రిని ఎవరో ధ్వంసం చేస్తున్నారని, వస్తువులను ఎత్తుకెళ్తున్నారని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వారెవరో వెంటనే గుర్తించి కేసులు నమోదు చేయాలని మంత్రి కేటీఆర్ఆదేశించారు. తమ సర్కిళ్ల పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు, డీఈలు, ఏఈలు , జవాన్లు, ఎస్ఎఫ్ఏలు నిరంతరం నిర్వహణను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతిరోజు టాయిలెట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉండేలా సంబంధిత నిర్వహణ ఏజెన్సీలను కూడా ఆదేశించారు.దీంతో ఉన్నతాధికారులు ప్రస్తుతం టాయిలెట్ల దొంగలను గుర్తించి పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 
ఎన్నికల ముందు హడావిడిగా..
గ్రేటర్ ఎన్నికలకు ముందు హడావుడిగా మెయిన్రోడ్ల వెంట ఇరువైపులా బల్దియా టాయిలెట్లను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం ఏ ఒక్కటి కూడా పనిచేయడం లేదు.  రూ.19 కోట్లతో  7,856 టాయిలెట్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ముందుగా 5,728 టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసింది. ఇందులో 5,036 టాయిలెట్ల నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించింది. వీటి నిర్వహణ కోసం ఒక్కో టాయిలెట్కు నెలకి రూ.4 వేలు చెల్లిస్తోంది. ఇలా నెలకి రూ.2 కోట్లకుపై గానే ఖర్చు చేస్తోంది. కమర్షియల్ ఏరియాల్లో  ఒక్కో టాయిలెట్ ను రోజుకు నాలుగు, ఐదు సార్లు, ఇతర ప్రాంతాల్లో మూడు సార్లు క్లీన్చేసేలా ఏజెన్సీలకు రూల్ పెట్టింది. ప్రతి టాయిలెట్కు ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్  కూడా కేటాయించారు. దీని ఆధారంగా టాయిలెట్ల నిర్వహణపై జనాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ప్రారంభ సమయంలో అధికారులు ప్రకటించారు. 
అన్నీ డ్యామేజే..
ప్రస్తుతం టాయిలెట్లను చూస్తే అన్ని డ్యామేజ్అయినట్టు అధికారులు చెప్పారు. 14 వేల వరకు డ్యామేజ్లు గుర్తించామని పేర్కొన్నారు. దొంగలు టాయిలెట్ల లోపల ట్యాప్లు, పైపులు, వాటర్డబ్బాలను ఎత్తుకెళ్లారని, కొన్ని టాయిలెట్లలో రాళ్లతో కుండీలను పడగలగొట్టినట్లు తెలిపారు.  ఒకటి, రెండు డ్యామేజ్అయినప్పుడే గుర్తిస్తే ఈజీగా ఉండేది. అన్నింటిని ఒకేసారి గుర్తించడంతో ప్రస్తుతం టాయిలెట్లు వాడకంలో లేకుండా పోయాయి. నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎమర్జెన్సీగా వస్తే  ఎక్కడికి వెళ్లాలని జనాలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికారులు వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సులభ్‌ల్లోకే ఎక్కువగా..
పే అండ్ యూజ్ టాయిలెట్లు మాత్రమే నీట్ గా కనిపిస్తున్నాయి. జనం కూడా వాటిలోకే ఎక్కువగా వెళ్తున్నారు. ప్రధానంగా బస్టాప్ల వద్ద ఉండే సులభ్కాంప్లెక్స్లను అధికంగా వినియోగిస్తున్నారు. బల్దియా ఏర్పాటు చేసిన ఫ్రీ టాయిలెట్లు ఏ మాత్రం వాడకానికి వీలు లేకుండాపోయాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న బల్దియా టాయిలెట్ల నిర్వహణను మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి.  ఏజెన్సీలు కూడా టాయిలెట్లను వదిలేశాయని, నిర్వహణ చేయకుండానే బల్దియా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి.