యాసిడ్ పోస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు

యాసిడ్ పోస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు
  • లోక్ సభ లాబీలోనే మహిళా ఎంపీకి బెదిరింపులు
  • జైల్​లో పెడతామంటూ శివసేన ఎంపీ బెదిరించిండు
  • యాసిడ్​ పోస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని స్పీకర్‌‌‌‌కు కంప్లైంట్ చేసిన ఎంపీ నవనీత్‌‌ కౌర్‌‌‌‌

మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే  జైలుకు పంపుతామని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని లోక్‌‌సభ స్పీకర్​కు  నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. తనపై యాసిడ్ పోస్తామంటూ ఆ పార్టీ నుంచి లెటర్స్, కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: లోక్​సభ లాబీలో శివసేన ఎంపీ అరవింద్​ సావంత్​ తనను బెదిరించాడని అమరావతి ఎంపీ నవనీత్​ కౌర్ ​రానా ఆరోపించారు. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడాననే తనపై బెదిరింపులకు దిగాడని చెప్పారు. రాష్ట్రంలో అడుగుపెడితే అరెస్టు చేయించి, జైలులో పెట్టిస్తానని వార్నింగ్​ ఇచ్చాడని వివరించారు. లోక్​సభ లాబీలో ఈ సంఘటన చోటుచేసుకున్న టైమ్​లో రాజమండ్రి ఎంపీ భరత్​ మార్గానీ కూడా అక్కడే ఉన్నారని, అరవింద్​ మాటలను విన్నారని అన్నారు. అరవింద్​ బెదిరింపుల విషయాన్ని స్పీకర్​ ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లానని కౌర్​ వివరించారు. ఎంపీ అరవింద్​ సావంత్​ను కఠినంగా శిక్షించాలని కోరానన్నారు.
సర్కారుపై ఆరోపణలు..
నెలనెలా వంద కోట్లు వసూలుచేసి ఇవ్వాలని మహారాష్ట్ర హోంమంత్రి పోలీసులకు టార్గెట్​ పెట్టారని ముంబై మాజీ సీపీ పరంబీర్​ సింగ్​ ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తూ.. మాజీ సీపీ ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం ఉద్ధవ్​ థాక్రే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశానని రానా తెలిపారు. ఆ తర్వాత నుంచే తనకు శివసేన లెటర్​హెడ్​తో తనకు బెదిరింపు లెటర్లు వస్తున్నాయని, యాసిడ్​ దాడి చేస్తామని ఫోన్​లలో బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్​కు కంప్లైంట్​ చేశామన్నారు. అయితే, ఎంపీ నవనీత్​ కౌర్​ ఆరోపణలను శివసేన ఎంపీ అరవింద్​ ఖండించారు.