హైదరాబాద్ శివార్లలోని గండిపేట్ లో నకిలీ జీవోల సృష్టి కలకలం రేపుతోంది. ఏకంగా ప్రభుత్వ భూమినే కబ్జా చేసేందుకు స్కెచ్ వేసిన ముగ్గురు నిందితుల బండారం బయటపడింది. గండిపేట్ సర్వే నంబర్ 18లో ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు బరితెగించారు.
ప్రభుత్వమే ఆ భూమిని తమకు కేటాయించిందంటూ నిందితులు నకిలీ జీవోలను సృష్టించారు. అంతేకాదు ఆ ఫేక్ డాక్యుమెంట్లతో ఏకంగా హైకోర్టులోనే తప్పుడు కేసులు ఫైల్ చేసి భూమిని చేజిక్కించుకోవాలని చూశారు. అయితే విచారణలో ఆ పత్రాలు నకిలీవని తేలడంతో... ఇటీవల హైకోర్టు ఆ కేసును డిస్మిస్ చేసింది. కోర్టులో చుక్కెదురు కావడంతో నిందితుల మోసం పూర్తిగా వెలుగుచూసింది.
ప్రభుత్వ ఉత్తర్వులనే ఫోర్జరీ చేయడంపై సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగంలోకి దిగిన తహసిల్దార్... నకిలీ జీవోలు సృష్టించిన వేణుగోపాల్ గౌడ్, నిమ్మల భాగస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్‌లపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లతో రంగంలోకి దిగారు.
ప్రస్తుతం నిందితుల ఇళ్లలో నార్సింగి పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. గండిపేట విలేజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు, ఫోర్జరీ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
