కోల్‌కతా: ఆర్.జి.కర్ వైద్య కళాశాల ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. కోల్‌కతా పోలీస్ మాజీ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్) ఇందిరాముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ (నార్త్) అభిషేక్ గుప్తాలను విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు, అలాగే ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశాలు నిర్వహించినందుకు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ అధికారులపై బెంగాల్ ప్రభుత్వం శాఖాపరమైన విచారణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆగస్టు 2024లో ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఒక లేడీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ తీవ్ర నిరసనలకు దారితీసింది.
ఆ సమయంలో అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరించిన తీరు, ఇప్పుడు సస్పెండ్‌కు గురైన ముగ్గురు ఐపీఎస్ అధికారుల ప్రవర్తనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. కాగా, బాధితురాలి తల్లి రత్నా దేబ్‌నాథ్ ఇటీవల నూతనంగా ఏర్పడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి పానిహతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
