హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. బుధవారం మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో నిందితుల సంఖ్య 40కి చేరింది. ఇందులో సిట్ 39 మందిని అదుపులోకి తీసుకోగా.. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌రెడ్డి కోసం లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న టీఎస్‌పీఎస్సీ మాజీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సురేశ్.. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి వద్ద ఏఈ, డీఏఓ పేపర్స్ తీసుకున్నాడని దర్యాప్తులో తేలింది. సైదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సురేశ్ నివాసం ఉండేవాడు.
అదే అపార్ట్‌మెంట్‌లో వరంగల్‌కు చెందిన రాయపురం విక్రమ్, అతని భార్య రాయపురం దివ్య ఉంటున్నారు. విక్రమ్ కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా.. దివ్య బీఎస్సీ పూర్తి చేసింది. విక్రమ్ బావ పూల రవికిశోర్.. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రవి కిషోర్ మధ్యవర్తిత్వంతో విక్రమ్, దివ్యకు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్‌ను సురేశ్ విక్రయించాడు. ఈ నేపథ్యంలోనే ముగ్గురినీ సిట్ అరెస్టు చేసింది. ఏఈ పేపర్ కొనుగోలు చేసిన మరికొంత మందిని సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నదని సమాచారం. గురువారం మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సిట్ కస్టడీలో ముగ్గురు ఏఈ ‘టాపర్స్’
అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షలో టాపర్స్‌గా నిలిచిన సుచరిత, శాంతి, రాహుల్‌ను సిట్ అధికారులు బుధవారం ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం వరకు వారిని విచారించనున్నారు. సుచరిత.. ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్య. శాంతి.. మరో కీలక నిందితురాలు రేణుక వదిన. రేణుక ఫ్రెండ్ రాహుల్ కూడా ఏఈ పరీక్షలు రాసి టాపర్స్‌గా నిలిచారు. ముగ్గురు టాపర్స్‌గా నిలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు.. ఏఈ పేపర్ ఎన్ని రోజుల క్రితం వీరికి చేరిందనే వివరాలు రాబడుతున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా వీరి విద్యార్హతలు, గత పరీక్షల మార్కులు తదితర అంశాలను పరిశీలించారు.
