దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్‌ను విజయ పరంపరలో నిలిపిన టిమ్ కుక్.. సెప్టెంబర్ 1, 2026న సీఈఓ బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. 2011లో స్టీవ్ జాబ్స్ వారసుడిగా పగ్గాలు చేపట్టిన కుక్.. ఆపిల్ కంపెనీ విలువను ఏకంగా 4 ట్రిలియన్ డాలర్లకు చేర్చి అసాధ్యమైన మైలురాయిని అధిగమించారు. 65 ఏళ్ల కుక్ ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతూ.. సంస్థకు మార్గనిర్దేశం చేయనున్నారు. అయితే ఆయన స్థానంలో ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ దిగ్గజం జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కుక్ నాయకత్వంలో ఆపిల్ కేవలం ఐఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ వంటి ఉత్పత్తులతో ఒక భారీ ఎకోసిస్టమ్‌ను నిర్మించింది. సప్లై చైన్ నిర్వహణలో ఆయన ప్లానింగ్ సంస్థను ఆర్థికంగా తిరుగులేని శక్తిగా మార్చింది. తన పదవీ కాలంలో ఆపిల్ మార్కెట్ విలువను 3.6 ట్రిలియన్ డాలర్లకు పైగా పెంచిన కుక్, ఆపిల్ సంస్థకు నాయకత్వం వహించటం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు.
కొత్త సీఈఓగా రానున్న 50 ఏళ్ల జాన్ టెర్నస్ నియామకం ఆపిల్ వ్యూహంలో కీలక మార్పును సూచిస్తోంది. గత 25 ఏళ్లుగా సంస్థలో ఉన్న టెర్నస్, ఐఫోన్ నుంచి విజన్ ప్రో హెడ్సెట్ వరకు దాదాపు అన్ని ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కుక్ వ్యాపార సామర్థ్యంపై దృష్టి పెడితే.. టెర్నస్ హార్డ్‌వేర్ ఆవిష్కరణలపై పట్టు ఉన్న వ్యక్తి. దీంతో రాబోయే రోజుల్లో ఆపిల్ మరింత వినూత్నమైన డిజైన్లతో ముందుకు వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆపిల్ ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి సంస్థలు AI రంగంలో దూసుకుపోతుంటే.. ఆపిల్ కొంత వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో బయటి సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా ఏఐని బలోపేతం చేయడం, టెర్నస్ నేతృత్వంలో కొత్త ఆవిష్కరణలు చేయడం సంస్థ ముందున్న ప్రధాన సవాళ్లు. టిమ్ కుక్ అందించిన పటిష్టమైన పునాదిపై టెర్నస్ ఆపిల్‌ను ఏ దిశగా నడిపిస్తారో వేచి చూడాల్సిందే మరి.

