కోరిన కోరికలు తీర్చే.. కలియుగ ప్రత్యేక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ ఏడుకొండలు.. ఎన్నో తీర్థాలకు, పవిత్ర ప్రదేశాలకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవిలో కొలువైన తీర్థాల్లో తుంబుర తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే.. తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి.
తిరుమల శేషాచలం అడవులలోని పవిత్రమైన శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ప్రతి సంవత్సరం ఫాల్గుణ/చైత్ర పౌర్ణమి సమయంలో ఘనంగా జరుగుతుంది. ఇ రోజున తీర్థంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని నమ్మకం. పాపవినాశనం నుండి సుమారు 7 కి.మీ. ట్రెక్కింగ్ ద్వారా భక్తులు తుంబురు తీర్థానికి చేరుకుంటారు. దీనికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది
తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి మహోత్సవం ఈ ఏడాది ( 2026) మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.తుంబురు తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు
తుంబురు తీర్థానికి వచ్చే భక్తులను మార్చి 31న మరియు ఏప్రిల్ 1 తేదీలలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. - పాపవినాశనం డ్యామ్ దగ్గర భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీటిని వంద మంది శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు, దీర్ఘవ్యాధిగ్రస్తులకు, గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని టీటీడీ అధికారులు తెలిపారు.భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని టీటీడీ అధికారులు తెలిపారు.
