‘మునిగిన’ టైటానిక్‌ షిప్‌యార్డ్‌

‘మునిగిన’ టైటానిక్‌ షిప్‌యార్డ్‌

టైటానిక్‌‌‌‌.. పరిచయం అక్కర్లేని పేరు. ఆ షిప్పు పేరు వింటేనే, విలాసం, హుందాతనం కళ్ల ముందు కదులుతాయి. దాని ఆధారంగా ఓ మంచి లవ్​ స్టోరీతో సినిమా కూడా తీశారు డైరెక్టర్​ కేమరూన్​. అయితే, ఆ షిప్పును నిర్మించింది ఎవరు, కంపెనీ ఏంటన్నది చాలా మందికి బహుశా తెలిసుండదు.  ఐర్లాండ్​కు చెందిన  హార్లాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ వుల్ఫ్‌‌‌‌ టైటానిక్​కు రూపునిచ్చింది. 150 ఏళ్లు సేవలందించిన ఆ కంపెనీ ప్రస్థానం ఇక ముగిసింది.  ఆగస్టు 5న కంపెనీల లిస్టులోంచి దాని పేరు తొలగిపోయింది. తీసుకున్న అప్పులు కట్టకపోవడంతో ఆ కంపెనీ అధికారికంగా దివాలా తీసింది.  కంపెనీని కొనేవాళ్ల కోసం 9 నెలలు ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగస్టు 5న మూసేశారు.

బెల్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ అంటే షిప్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌

ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద షిప్‌‌‌‌యార్డ్‌‌‌‌లలో హార్లాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ వుల్ఫ్‌‌‌‌ ఒకటి. బ్రిటన్‌‌‌‌ చరిత్రలో అత్యద్భుతమైన షిప్పులను నిర్మించింది. అప్పట్లో కంపెనీలో 35 వేల మంది ఉద్యోగులుండేవారు. హెచ్‌‌‌‌ అండ్‌‌‌‌ డబ్ల్యూ పేరు ఎంతలా మారుమోగిందంటే 1914లో ప్రపంచంలోనే అతి పెద్ద షిప్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌గా బెల్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ అవతరించింది. 1912లో హెచ్‌‌‌‌ అండ్‌‌‌‌ డబ్ల్యూ నిర్మించిన టైటానిక్‌‌‌‌ మునిగినా దాని ప్రభావం కంపెనీపై పడలేదు. పైగా అదే ఏడాది లివర్‌‌‌‌పూల్‌‌‌‌, గోవన్‌‌‌‌, సౌతాంప్టన్‌‌‌‌లలో యార్డులను తీసుకుంది.  యుద్ధనౌకలనూ తయారు చేసింది. ఇప్పటివరకు 130 వార్‌‌‌‌షిప్‌‌‌‌లు, చాలా వరకు ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ క్యారియర్లను నిర్మించింది. ట్యాంకులు, బాంబర్లను కూడా తయారు చేసింది. రెండు ప్రపంచ యుద్ధాల్లో ముఖ్య పాత్ర పోషించింది.

అయితే, యునైటెడ్‌‌‌‌ ఐర్లాండ్‌‌‌‌ కోసం క్యాథలిక్‌‌‌‌ ఐరిష్‌‌‌‌ నేషనలిస్టులు, ఉత్తర ఐర్లాండ్‌‌‌‌ను బ్రిటన్‌‌‌‌లో కలపాలని ప్రో బ్రిటిష్‌‌‌‌ యునియనిస్టులు మూడు దశాబ్దాల పాటు పోరాడారు. దీంతో హింస చెలరేగింది. 3,600 మంది మృతి చెందారు. ఈ అల్లర్ల ప్రభావం కంపెనీపై చాలా వరకు ఉంది. బ్రిటన్‌‌‌‌లో ఉత్తర ఐర్లాండ్‌‌‌‌ కలవొద్దని కోరుకుంటున్న వారికి కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు మద్దతిచ్చారు. 1941లో బెల్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌లో అల్లర్లు జరిగాయి. సుమారు వెయ్యి మంది చనిపోయారు. 50 వేల ఇళ్లు నాశనమయ్యాయి. కంపెనీని టార్గెట్‌‌‌‌ చేసే దాడులు జరిగాయని చాలా మంది ఆరోపించారు. ఆ తర్వాత ‘హార్లాండ్‌‌‌‌’కు పోటీగా బ్రిటన్‌‌‌‌లో షిప్‌‌‌‌ బిల్డర్లు పుట్టుకొచ్చారు. ఆ కంపెనీల దెబ్బకు తట్టుకోలేకపోయింది. మెల్లమెల్లగా దాని ప్రతిష్ట తగ్గడం మొదలైంది.

1975 జాతీయం.. 1989 మళ్లీ ప్రైవేటుకు..

తీవ్ర నష్టాలతో కంపెనీని 1975లో జాతీయం చేశారు. తర్వాత 1989లో మళ్లీ ప్రైవేటు వ్యక్తులు అధీనంలోకి తీసుకున్నారు. తర్వాత ఆయిల్‌‌‌‌ కంపెనీలకు షిప్పుల తయారీపై సంస్థ దృష్టిపెట్టింది. కానీ బ్రిటన్‌‌‌‌తో పోటీ పడలేకపోయింది. ఉత్తర సముద్రంలో విండ్‌‌‌‌ టర్బైన్ల అసెంబ్లింగ్‌‌‌‌ పని కూడా చేసింది. కానీ అదీ సరిపోలేదు. నష్టాలను పూడ్చలేదు. అప్పట్లో 30 వేల మంది ఉన్న ఉద్యోగులు ఇప్పుడు 125కు తగ్గారు. గత యాభై ఏళ్లుగా కంపెనీ నష్టాల్లోనే ఉంది. 15 ఏళ్లుగా ఒక్క షిప్పు కూడా నిర్మించలేదు.

 ప్లాంట్‌‌‌‌లో టైటానిక్‌‌‌‌ మ్యూజియం

యాజమాన్యం నిర్ణయం వల్ల ఉద్యోగాలు పోయేలా ఉన్నా షిప్‌‌‌‌యార్డు మొత్తం మాత్రం మూతబడదు. ఎందుకంటే షిప్‌‌‌‌యార్డులోని చాలా భాగం బెల్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ హార్బర్‌‌‌‌ కమిషనర్స్‌‌‌‌ లీజుకు తీసుకున్నారు. షిప్‌‌‌‌యార్డులోని కొద్ది భాగాన్ని అమ్మేశారు. అందులో టైటానిక్‌‌‌‌ మ్యూజియం కట్టనున్నారు. టైటానిక్‌‌‌‌ షిప్‌‌‌‌ను డిజైన్‌‌‌‌ చేసిన బిల్డింగ్‌‌‌‌లో తాజాగా 4 స్టార్‌‌‌‌ హోటల్‌‌‌‌ను ప్రారంభించారు. గవిన్‌‌‌‌ రొబిన్‌‌‌‌సన్‌‌‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్ట్‌‌‌‌ బెల్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌లోనే ప్లాంట్‌‌‌‌ ఉంది. కంపెనీని గట్టెక్కించేందుకు తమ డెమొక్రటిక్‌‌‌‌ యూనియనిస్ట్‌‌‌‌ పార్టీ చాలా ప్రయత్నించిందని, కానీ కుదరలేదని గవిన్‌‌‌‌ చెప్పారు.