- కల్లు, నీరా విశిష్టత తెలియజేయడమే లక్ష్యం
- మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
పంజాగుట్ట, వెలుగు: ఈ నెల 24న ఎక్పీరియమ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘టాడీ మ్యాజిక్ ఫెస్టివల్’ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి ఈ ఫెస్టివల్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. సహజసిద్ధమైన కల్లు, నీరా విశిష్టతను నగర వాసులకు తెలియజేయడమే లక్ష్యంగా నగర శివార్లలోని చిలుకూరు ఎక్పీరియమ్ పార్కులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన కల్లును ప్రకృతి ప్రసాదంగా నగర వాసులకు అందించేందుకు ఎక్పీరియమ్ సంస్థ 150 ఎకరాల్లో 25 వేల జాతుల మొక్కలతో ఈ వనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రైతులు కూడా ఈత, తాటి వనాల పెంపుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని మంత్రి సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి, గీత సంఘాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎక్పీరియమ్ నిర్వాహకులు రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.
