Dil Raju: పెద్ద మనసు చాటుకున్న దిల్ రాజు.. రోడ్డుపై అనాథగా మిగిలిన నటి శ్యామలకు లైఫ్ లైన్!

Dil Raju: పెద్ద మనసు చాటుకున్న దిల్ రాజు.. రోడ్డుపై అనాథగా మిగిలిన నటి శ్యామలకు లైఫ్ లైన్!

వెండితెరపై వందలాది చిత్రాలలో తనదైన నటనతో, హాస్యంతో కోట్లాది మందిని నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల జీవితం నేడు కన్నీటి సుడిగుండంగా మారింది. వృద్ధాప్యం ఒకవైపు, తీవ్ర అనారోగ్యం, ఆర్థిక కష్టాలు మరోవైపు ఆమెను వెంటాడుతున్నాయి. నిన్న ( మే 15, 2026 ) రాత్రి కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి గుండెనొప్పితో వెళ్లిన ఆమెకు, చేతిలో డబ్బుల్లేవనే కారణంతో అక్కడి సిబ్బంది కనీస మానవత్వం లేకుండా బయటకు పంపించేశారు. ఆఖరికి క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోవడం కలచివేసింది.

దీనికి సంబంధించిన హృదయ విదారక ఫోటోలు, వార్తలు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ ముందుండే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌ రాజు ఈ వార్తలపై తక్షణమే స్పందించారు. ఆమెను రక్షించేందుకు తన ప్రత్యేక మేనేజర్ల బృందాన్ని రంగంలోకి దించారు. శ్యామల  ప్రస్తుతం కూకట్‌పల్లిలోని 'ప్రసాద్ హాస్పిటల్స్'లో ఉన్నట్లు గుర్తించి, దిల్ రాజు స్వయంగా అక్కడి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు.

శ్యామల గారికి ఎలాంటి లోటు లేకుండా పూర్తిస్థాయి మెరుగైన వైద్యం అందించండి. దానికి అయ్యే ఖర్చులన్నీ నావి. మా బృందం మీతో టచ్‌లో ఉంటుంది అని దిల్ రాజు వైద్యులకు భరోసా ఇచ్చారు. దిల్ రాజు టీమ్ ఆసుపత్రికి చేరుకుని పరామర్శించగా, పావలా శ్యామల భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలోనూ దిల్‌ రాజు నన్ను ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. ఈ రోజు నా ప్రాణాలు పోయే స్థితిలో మళ్ళీ ఆయనే దేవుడిలా అండగా నిలిచారు అంటూ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ఒక గొప్ప నటి పరిస్థితి ఇలా కావడం బాధాకరమైనప్పటికీ, దిల్ రాజు చూపిన మానవత్వంపై సినీ వర్గాలు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.