ViRosh Wedding: వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న

ViRosh Wedding: వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న

టాలీవుడ్ టాప్ స్టార్స్ విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్ వైపు నుంచి హిందూ సంప్రదాయ పద్ధతిలో గురువారం (2026 ఫిబ్రవరి 26) ఉదయం రష్మిక మెడలో తాళి కట్టి ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు, ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సంప్రదాయం, ఆచారం, ఆత్మీయతతో జరిగిన ఈ వివాహం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.

అనంతరం సాయంత్రం 4:30 గంటలకు, రష్మిక కుటుంబ సంప్రదాయం ప్రకారం కొడవ ప‌ద్ధ‌తిలో మరోసారి పెళ్లి జరగనుంది. రష్మిక కొడవ వర్గానికి చెందినవారు కావడంతో, వారి సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఈ పెళ్లి నిర్వహించనునున్నారు.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

వివాహం అనంతరం ‘విరోష్’ జోడీ హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మార్చి 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇక ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో, హైదరాబాద్‌లో ఈ వేడుక హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్–రష్మిక ప్రేమకథ ఎలా మొదలైంది?

2018లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్, రష్మిక తొలిసారి కలిసి నటించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత 2019లో ‘డియర్ కామ్రేడ్‌‌‌‌’తో వీరి బంధం మరింత బలపడింది.

అప్పటి నుంచి వీళ్లిద్దరూ డేటింగ్‌‌‌‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలొచ్చాయి. అలా వెకేషన్‌‌‌‌కు కలిసి వెళ్లడం, ఇద్దరి ఫొటోస్‌‌‌‌లోనూ ఒకే లొకేషన్‌‌‌‌ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇక ఎట్టకేలకు ఉదయ్‌పూర్ అరవళ్ల కొండల సాక్షిగా పెళ్లిబంధంతో ఒక్కటయ్యింది ఈ విరోష్ జంట. ఆసక్తికర విషయం ఏంటంటే.. విజయ్–రష్మికల పెళ్ళికి ఏడడుగులు, ప్రేమకి ఏడేళ్లు.. వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఏడేళ్లు.