భారీ టార్గెట్​ను కాపాడుకోలేకపోయిన ఇండియా

భారీ టార్గెట్​ను కాపాడుకోలేకపోయిన ఇండియా

మొహాలీ:  ఫోర్లు, సిక్సర్ల పోటీలో ఇండియాపై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది.  అద్భుత బ్యాటింగ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో భారీ స్కోరు చేసిన ఇండియా.. పేలవ బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌తో దాన్ని కాపాడుకోలేకపోయింది. కామెరూన్‌‌ గ్రీన్‌‌ (30 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), మాథ్యూ వేడ్‌‌ (21 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్‌‌) పవర్‌‌ హిట్టింగ్‌‌తో చెలరేగడంతో  మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా  మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. తొలుత హార్దిక్‌‌ పాండ్యా (30 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 నాటౌట్​), కేఎల్‌‌ రాహుల్‌‌ (35 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) ఫిఫ్టీలతో ఇండియా 20 ఓవర్లలో 208/6 స్కోరు చేసింది. సూర్యకుమార్‌‌ (25 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46) సత్తా చాటాడు. అనంతరం గ్రీన్‌‌, వేడ్‌‌ దెబ్బకు ఆసీస్‌‌ 19.2 ఓవర్లలో 211/6 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అక్షర్‌‌ (3/17), ఉమేశ్‌‌ (2/27) తప్ప మిగతా బౌలర్లు ఫెయిలయ్యారు.  గ్రీన్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్ దక్కింది. రెండో టీ20 శుక్రవారం నాగ్‌‌పూర్‌‌లో జరుగుతుంది. 

కేఎల్‌‌, సూర్య, పాండ్యా ఫటాఫట్‌‌

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో 6,4తో టచ్‌‌లోకి వచ్చిన కెప్టెన్‌‌ రోహిత్‌‌ (11)ను మూడో ఓవర్లోనే హేజిల్‌‌వుడ్‌‌ వెనక్కిపంపగా.. ఫామ్​లో ఉన్న కోహ్లీ (2) గ్రీన్‌‌కు సింపుల్‌‌ క్యాచ్‌‌ ఇవ్వడంతో  ఇండియా 35/2తో నిలిచింది. అయితే, అప్పటికే సిక్స్‌‌, రెండు ఫోర్లతో స్పీడు పెంచిన రాహుల్‌‌కు సూర్యకుమార్‌‌ తోడయ్యాడు. వచ్చీరాగానే కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో 4,6 కొట్టి సూర్య జోరు చూపెట్టగా.. మరో ఎండ్‌‌లో కేఎల్‌‌ వరుస షాట్లతో చెలరేగాడు. తన ఫామ్‌‌పై వస్తున్న విమర్శలకు చెక్‌‌ పెడుతూ  35 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సూర్య, కేఎల్​ దెబ్బకు 12వ ఓవర్లోనే స్కోరు 100 దాటింది. అదే ఓవర్లో కేఎల్​ ఔటైనా.. వెనక్కుతగ్గని సూర్య స్పిన్నర్‌‌ జంపా బౌలింగ్‌‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఫిఫ్టీకి చేరువైన తను గ్రీన్‌‌ బౌలింగ్‌‌లో కీపర్‌‌ వేడ్‌‌కు చిక్కాడు. 14 ఓవర్లకు 131/4తో మెరుగైన స్థితిలో నిలవగా.. స్లాగ్‌‌ ఓవర్లలోహార్దిక్‌‌ దంచికొటాడు.  అక్షర్‌‌ (6), దినేశ్‌‌ (6) ఫెయిలైనా తను రెచ్చిపోయాడు. 25 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ దాటిన పాండ్యా... గ్రీన్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో పవర్‌‌ ఫుల్‌‌ షాట్లతో 6, 6, 6 కొట్టి స్కోరు 200 దాటించాడు. 

క్యాచ్​లు విడిచి.. మ్యాచ్​ చేజార్చి

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఆసీస్‌‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఇండియా చెత్త ఫీల్డింగ్‌‌ను సొమ్ము చేసుకొని లక్ష్యాన్ని కరిగించింది. మూడు క్యాచ్​లు విడిచిన హోమ్​టీమ్​ మ్యాచ్​ చేజార్చుకుంది.  ఇన్నింగ్స్‌‌ తొలి బాల్‌‌నే సిక్స్‌‌గా మలచిన ఓపెనర్​ ఫించ్‌‌ (22) తమ ఉద్దేశం ఏంటో చెప్పగా.. ఉమేశ్‌‌ వేసిన రెండో ఓవర్లో గ్రీన్‌‌ వరుసగా 4 ఫోర్లు బాదాడు. నాలుగో ఓవర్లో ఫించ్​ను అక్షర్‌‌ బౌల్డ్​ చేసిబ్రేక్‌‌ ఇచ్చాడు. కానీ,వన్‌‌డౌన్‌‌లో వచ్చిన స్మిత్‌‌ (35) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయగా.. గ్రీన్‌‌ దూకుడు కొనసాగించాడు. ఈ ఇద్దరి క్యాచ్‌‌లను అక్షర్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ డ్రాప్‌‌ చేయడం ఇండియాను దెబ్బకొట్టింది. ఈ చాన్స్‌‌ సద్వినియోగం చేసుకున్న  గ్రీన్‌‌ మరింత రెచ్చిపోయాడు. 10 ఓవర్లోనే స్కోరు వంద దాటించాడు. అయితే, 11వ ఓవర్లో గ్రీన్‌‌ను అక్షర్​ ఔట్‌‌ చేయగా.. తర్వాతి ఓవర్లోనే స్మిత్‌‌తో పాటు మ్యాక్స్‌‌వెల్‌‌ (1)ను ఉమేశ్‌‌ వెనక్కుపంపాడు.  ఆపై, ఇంగ్లిస్ (17)ను అక్షర్‌‌ బౌల్డ్‌‌ చేయడంతో ఇండియా రేసులోకి వచ్చింది. కానీ, ఏడో నంబర్​లో వచ్చిన కీపర్‌‌ వేడ్‌‌.. మన బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  18 బాల్స్‌‌లో ఆసీస్‌‌కు 40 రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో  హర్షల్‌‌ బౌలింగ్‌‌లో తను రెండు సిక్సర్లు, టిమ్ డేవిడ్‌‌ (18) ఓ సిక్స్‌‌ బాది మ్యాచ్​ను తమవైపు లాగేసుకున్నారు. ఆపై, భువీ బౌలింగ్‌‌లో 4,4,4తో  వేడ్‌‌ గెలుపు ఖాయం చేయగా.. ఆఖరి ఓవర్లో  కమిన్స్‌‌ (4 నాటౌట్‌‌) విన్నింగ్‌‌ ఫోర్‌‌ కొట్టాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 208/6 (పాండ్యా 71 నాటౌట్​, రాహుల్‌‌ 55, ఎలిస్‌‌ 3/30).
ఆస్ట్రేలియా: 19.2 ఓవర్లలో 211/6 (గ్రీన్‌‌ 61, వేడ్‌‌ 45 నాటౌట్‌‌,అక్షర్‌‌ 3/17).