దేవుడి పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా..? బీజేపీపై మహేష్ గౌడ్ ఫైర్

దేవుడి పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా..? బీజేపీపై మహేష్ గౌడ్ ఫైర్

హైదరాబాద్: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరిస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‎ను ఉరి తీసినా తప్పు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను నిరసిస్తూ శనివారం (జూన్ 20) గాంధీ భవన్‎లో తెలంగాణ కాంగ్రెస్ సేమ్ డెమోక్రసీ పేరుతో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ కుట్రపూరితంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిందని ఆరోపించారు. 

బీజేపీ పాలన అడ్డూ అదుపు లేకుండా సాగుతుందని.. మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ తీరు చూస్తే.. మోడీ దుర్మార్గం అర్థం అవుతుందని విమర్శించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని.. అధికారం కోసం ఏ చేసేందుకైనా బీజేపీ సిద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి నమ్మకం లేదని.. మేం చెప్పిందే రాజ్యాంగం అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీఎంసీ, శివసేన, ఎన్సీపీ పార్టీలను నిలువునా చీల్చి రాజ్యాంగాన్ని బీజేపీ అపహస్యం చేస్తోందన్నారు. 

ALSO READ : నెల రోజుల్లోగా ఆ 1200 మందికి ఉద్యోగాలివ్వాలి..

మోడీ కుట్రలను కాంగ్రెస్ తిప్పికొడుతుందని పేర్కొన్నారు. బీజేపీ గాడ్సే జపం చేస్తోందన్నారు. ఉదయం లేస్తే దేవుడి పేరు జపం చేస్తారు.. దేవుడు పేరు చెప్పకుండా బీజేపీ నేతలకు గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. దేశంలో 90 శాతం సంపద బీజేపీ నేతల అనునయుల చేతిలో ఉందని ఆరోపించారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలు దేశ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు.. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.