హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనుల కారణంగా ఉప్పల్ చౌరస్తాను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు.
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా...
బస్ స్టాప్ మార్పు: ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న వరంగల్ బస్టాప్‌ను నల్లచెరువు కట్టకు మార్చారు.
భారీ వాహనాల డైవర్షన్: హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలు.. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
కార్లు, బైక్‌ల రూట్: హబ్సిగూడ నుంచి వచ్చే చిన్న వాహనాలు పిస్తాహౌజ్ నుంచి బీరప్ప గడ్డ మీదుగా వరంగల్ హైవేకి చేరుకోవచ్చు.
సిటీలోకి వచ్చే చిన్న వాహనాలు: మేడిపల్లి, బోడుప్పల్, ఫిర్జాదిగూడ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే బైక్స్, కార్లు.. మెహఫిల్ హోటల్ వద్ద లెఫ్ట్ తీసుకుని, ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్ బ్రిడ్జి కింద యూ-టర్న్ తీసుకుని ఉప్పల్ వైపు రావాలి.
సిటీలోకి వచ్చే భారీ వాహనాలు: వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు, లారీలు ఘట్‌కేసర్ వద్దే ఓఆర్ఆర్ (ORR) ఎక్కి, హయాత్‌నగర్ వద్ద దిగి, ఎల్బీనగర్ మీదుగా సిటీలోకి రావాల్సి ఉంటుంది.
ఈ ఆంక్షలు మూడు నెలల పాటు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. అయితే అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
