- ఆర్ అండ్ బీలో ప్రమోషన్ల వల్ల..విద్యుత్ శాఖలో 'రైతు డిస్కం' ఆప్షన్లతో బ్రేక్
- వేలాది మంది ఉద్యోగుల్లో నిరాశ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ముగియడంతో రెండు కీలక శాఖల్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రోడ్లు, భవనాల శాఖలో ప్రమోషన్ల ప్రక్రియ, విద్యుత్ శాఖలో రైతు డిస్కమ్‌కు సిబ్బంది కేటాయింపుల కారణంగా బదిలీలకు బ్రేక్ పడింది. ఆరేండ్ల తర్వాత వచ్చిన అవకాశం కావడంతో ఈ రెండు శాఖల ఉద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఏండ్ల తరబడి ఒకే పోస్టులో ఉంటూ బదిలీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేలాది మందికి సాంకేతికపరమైన అవాంతరాలు ఎదురయ్యాయి.
బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఎత్తివేసింది. బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఏప్రిల్ 21న జీవో 38 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల ప్రక్రియను మే 1 నుంచి 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించింది.జనవరి 1 నాటికి ఒకే స్థానంలో కనీసం 3 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులు. ఒకేచోట 4 ఏండ్లు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తింపజేసింది.
ఈ నియామకాల్లో భార్యాభర్తలకు సడలింపు ఇచ్చారు. కార్యాలయాల విధులకు అంతరాయం కలగకుండా గరిష్టంగా 40 శాతం మందిని మాత్రమే బదిలీ చేయాలని స్పష్టం చేసింది. జనగణన ప్రక్రియలో పాల్గొంటున్న ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. గడువు ముగియడంతో జూన్ 1 నుంచి బదిలీలపై ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించింది. అత్యవసర బదిలీలు చేయాల్సి వస్తే ఆర్థిక శాఖ, సంబంధిత మంత్రి ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.
ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల్లో బ్రేక్?
గత ప్రభుత్వ హయాంలో 2018లో చివరిసారిగా సాధారణ బదిలీలు జరిగాయి. ఆ తర్వాత బదిలీలపై పూర్తిస్థాయి నిషేధం కొనసాగింది. తాజాగా ఇచ్చిన సువర్ణావకాశాన్ని కౌన్సెలింగ్ ప్రక్రియ వరకు విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, చివరి నిమిషంలో ఆర్డర్స్ వచ్చే సమయానికి ఈ రెండు శాఖల్లో బ్రేక్ పడింది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తూ, ఒకేసారి బదిలీలు కూడా చేపట్టాలని భావించారు.
అయితే, 'హ్యామ్' విభాగానికి అధికారుల కేటాయింపుల్లో కొన్ని లోపాలు జరగడం వల్ల ఈ ఉత్తర్వులను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. దీనివల్ల సుమారు 3 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది మరింత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్‌కో, జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి పైగా పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు.
పెండింగ్‌లో ఉన్న మ్యుచువల్, స్పౌజ్, జనరల్ బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ.. సీనియారిటీ జాబితాలపై వివాదాలు తలెత్తడంతో ప్రక్రియ పూర్తి కాలేదు. దీనికి తోడు, కొత్తగా ఏర్పాటు కానున్న 'రైతు డిస్కమ్' లో చేరడానికి కొందరు ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వడం వల్ల గడువు ముగిసే సరికి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడలేదు. సాంకేతిక కారణాల వల్ల ఆర్డర్లు చేతికి రాకుండానే జూన్ 1 నుంచి సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వచ్చేసింది.
