ప్రభుత్వ స్కీమ్‌‌‌‌లు  గిరిజనులకు చేరాలి: ట్రైబల్ డైరెక్టర్ బీఎం సంతోష్

ప్రభుత్వ స్కీమ్‌‌‌‌లు  గిరిజనులకు చేరాలి: ట్రైబల్ డైరెక్టర్ బీఎం సంతోష్
  • సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చడమే “జన్ భాగిదారి అభియాన్” లక్ష్యం: ట్రైబల్ డైరెక్టర్ బీఎం సంతోష్
  • మాసాబ్ ట్యాంక్‌‌‌‌లోని డీఎస్‌‌‌‌ఎస్ భవన్‌‌‌‌లో ఘనంగా అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనుల గడపకు చేర్చడమే “జన్ భాగిదారి అభియాన్” లక్ష్యమని ట్రైబల్ డైరెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. గిరిజన సమాజ అభివృద్ధి, గౌరవం, భాగస్వామ్యం, సాధికారత కోసం ఇది ఒక ప్రజా ఉద్యమంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జనజాతీయ గరిమా ఉత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా మసాబ్ ట్యాంక్‌‌‌‌లోని డీఎస్‌‌‌‌ఎస్ భవన్‌‌‌‌లో మంగళవారం ఆయన “జన్ భాగిదారి అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా దర్తీ ఆబా జనజాతీయ ఉత్కర్ష్ అభియాన్, పీఎం జన్మన్, ఆదికర్మయోగి అభియాన్ పరిధిలోని గిరిజన గ్రామాలు, దూర ప్రాంతాలు, వెనుకబడిన గిరిజన వాసాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక శిబిరాల్లో ఆరోగ్య పరీక్షలు, సికిల్ సెల్, టీబీ స్క్రీనింగ్,  ఆధార్ అప్‌‌‌‌డేషన్, కుల-ఆదాయ ధృవపత్రాల జారీ, ఆయుష్మాన్ భారత్ నమోదు, పెన్షన్ ధ్రువీకరణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.  

గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు, గ్రామ సభలు, జన్ సున్వాయ్ శిబిరాలు,  జీవనోపాధి-స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గిరిజన యువత, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, టీసీఆర్ టీఐ డైరెక్టర్ సముజ్వల తదితర అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ మ్యూజియం డే 

గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు కూడా మంగళవారం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ శతజయంతి ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కుమ్రం భీమ్, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలకు ట్రైబల్ డైరెక్టర్ సంతోష్ నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ఆరు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, విలువలను భావితరాలకు పరిచయం చేసే ప్రధాన వేదికలుగా మ్యూజియంలు నిలుస్తాయని తెలిపారు.

కుమ్రం భీమ్, రాంజీ గోండ్ వంటి గిరిజన వీరుల పోరాటాలు, త్యాగాలను యువతకు పరిచయం చేయడంలో గిరిజన మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకునేలా మ్యూజియంలను ఇంటరాక్టివ్, డిజిటల్ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వచ్చే నవంబర్ 15 నాటికి రాంజీ గోండ్ స్మారక గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి చేసి, ప్రధానిని ఆహ్వానించి ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.